దేశంలో అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. కఠిన చట్టాలు.. శిక్షలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పసికందుల నుంచి పండు ముసలి దాకా.. హత్యాచారాలకు బలైపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే.. కోతుల గుంపు ఓ అఘాయిత్యాన్ని నిలువరించాయన్న వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఉత్తర ప్రదేశ్ భాగ్‌పట్‌లో ఆసక్తికరమైన ఘటన చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం చిదిమేందుకు ప్రయత్నించగా.. హఠాత్తుగా హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చిన కోతుల గుంపు అతనిపై దాడి చేసి ఆ ఘోరాన్ని ఆపాయి!!.
బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. దౌలా గ్రామంలో సెప్టెంబర్ 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాడుబడ్డ ఓ భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతుల గుంపు.. నిందితుడిని బెదరగొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టాయి. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిని మాత్రం అవి గాయపర్చలేదు.
అక్కడి నుంచి పరిగెత్తి ఇంటికి చేరుకున్న చిన్నారి.. జరిగిన ఘటనను.. కోతులు తననెలా రక్షించాయో తల్లిదండ్రులకు చెప్పింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. కోతుల గుంపు రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment