తమను విడిపించాలని వేడుకుంటున్న వృద్ధురాలు
భువనేశ్వర్: ఆస్తి తగాదా నేపథ్యంలో తల్లీకొడుకులు గృహనిర్బంధానికి గురైన అరుదైన సంఘటన స్థానిక సిర్‌పి ఛక్ ప్రియదర్శిని మార్కెట్ దగ్గర సంచలనం రేకిత్తించింది. వారం రోజులుగా 76 ఏళ్ల వృద్ధురాలు అనసూయ మహంతి, ఆమె కొడుకు గృహ బంధీలుగా ఉండడం చూసి, చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని చూసేందుకు జనాలు పోటెత్తడంతో అక్కడ 144 సెక్షన్ విధించి, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కైలాస్ చంద్రమహంతి(లేటు) తొలి భార్య అనసూయ మహంతి. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈమె భర్త నుంచి వేరుగా కొడుకుతో కలిసి నివాసముంటోంది.
ఈ క్రమంలో కైలాస్ మహంతి రెండో భార్యతో కలిసి ఇంట్లో ఉంటూనే ఇటీవల ఆయన చినిపోయారు. భర్త తదనంతరం ఆస్తిపై హక్కు కోసం అనసూయ మహంతి కోర్టుని ఆశ్రయించింది. 2021 అక్టోబరులో స్థానిక దిగువ కోర్టుకు ఈమెకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుని సవాలు చేస్తూ రెండో భార్య ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. ఇది విచారణ దశలో ఉండగా, తుది తీర్పు వెలువడేంతవరకు యథాతథ స్థితి(స్టేటస్–కో) కొనసాగుతుందని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి మరీ కొడుకుతో కలిసి భర్త ఉంటున్న ఇంట్లోకి చొరబడడంతో కైలాస్ మహంతి రెండో భార్య ఇంటి గేటు తలుపులకు తాళం వేసింది. దీంతో వారం రోజులుగా వారు అదే ఇంట్లో బంధీలుగా ఉన్నారు. న్యాయస్థానం పరిధిలో వీరి వివాదం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తాళాలు తీసి, తమకు స్వేచ్ఛ కల్పించాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment