భోపాల్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రచారంలో భాగంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిండోరిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ప్రజలను కోరారు. తాను మంచి ప్రభుత్వాన్నే నడుపుతున్నానా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా? ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నలు సంధించారు.
ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీనే విజయం సాధించాలని ఆశిస్తున్నారా?. ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగాలని కోరుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇక, సీఎం శివరాజ్‌సింగ్ అడిగిన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. అనంతరం పోటీ చేసేందుకు తాము ప్రజల అనుమతి తీసుకుంటామని సీఎం విలేకరులతో తెలిపారు. అంతకుముందు కూడా.. కొన్ని సమావేశాల్లో సీఎం చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. సొంత నియోజకవర్గం బుధ్నిలో తనను ఎన్నికల్లో పోటీ చేయమంటారా అని ప్రజలను అడిగిన విషయం తెలిసిందే.
మరోవైపు.. మధ్యప్రదేశ్ పర్యటనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ధార్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎంపై శివరాజ్ సింగ్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం గురించి మాట్లాడేందుకు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సీఎం పేరు ప్రస్తావించకుండానే ఓట్లు అడుగుతున్నారని అన్నారు. దీని బట్టి వచ్చే ఎన్నికల్లో సీఎం ఓటమి చవిచూడడం ఖాయమని ప్రియాంక ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment