
కాంగ్రెస్ పార్టీ నా రక్తదాహంతో ఉంది... రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : జన ఆశీర్వాద్ యాత్ర చేపడుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ బస్సుపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. రథం తరహాలో రూపొందించిన బస్సులో ఆయన యాత్ర చేపడుతుండగా.. సిద్ది ప్రాంతంలో ఆదివారం (సెప్టెంబర్ 2న) కొంతమంది ఆయన బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో తొమ్మిదిమందిని అరెస్టు చేసినట్టు హోంమంత్రి భూపేందర్‌సింగ్ తెలిపారు.
అయితే, ఈ ఘటనకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే కారణమని సీఎం చౌహాన్ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ పార్టీ నా రక్తదాహంతో ఉంది’ అని ఆయన మండిపడ్డారు. ‘మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదు. భావజాలపరమైన పోరాటాలు మాత్రమే ఇప్పటివరకు కొనసాగాయి. రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించుకోనేవి. కానీ ఇలాంటివి (రాళ్ల దాడి) ఎప్పుడూ జరగలేదు’ అని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.