ప్రమాదంలో కుప్పకూలిన భవనం
ముంబై/న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనంలోని రెండతస్తులు పక్కను న్న ఒకే అంతస్తు భవనంపై కూలిపో యాయి. మల్వానీ ప్రాంతంలోని న్యూ కలెక్టర్ కాంపౌండ్ వద్ద బుధవారం రాత్రి 11.15 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. ఏడాదిన్నర నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్న మొత్తం ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. శిథాలాల నుంచి 18 మందిని కాపాడారు.
ఒకే అంతస్తు భవనంలో అద్దెకు ఉంటున్న రఫీక్ షేక్(45) కుటుంబంలో ఆయన భార్యతోపాటు మరో ఎనిమిది మంది మరణించారు. కూలడానికి కొద్దిసేపు ముందే పాలు కొనేందుకు బయటకెళ్లడంతో రఫీక్ ప్రాణాలు దక్కించుకున్నారు. రఫీక్ కొడుకు సైతం ఔషధాల కోసం బయటికెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తిరిగి వచ్చాక తన కుటుంబ సభ్యులు విగత జీవులు కావడం చూసి రఫీక్ గుండెలవిసేలా రోదించారు. ఇటీవల టౌటే తుపాను ధాటికి భవనం దెబ్బతిన్నదని, అందుకే కూలిందని పోలీసు అధికారి విశ్వాస్ పాటిల్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి భవనం యజమాని, కాంట్రాక్టర్‌లపై కేసు నమోదు చేయనున్నట్టు డీసీపీ విశాల్ ఠాకూర్ చెప్పారు.
నష్ట పరిహారం ప్రకటించిన రాష్ట్ర సర్కారు
భవన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment