న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో జాతిపితకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆలోచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన బాధ్యత అని ప్రధాని ట్వీట్ చేశారు. అమరజవాన్ల దినోత్సవం సందర్భంగా దేశం రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవ, ధైర్యసాహసాలు మరువలేనివని ప్రధాని కొనియాడారు.
అహ్మదాబాద్: మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ ఉద్యమానికి అసలైన నిర్వచనం.. తమ ప్రభుత్వం కార్యక్రమాలైన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత్‌ను పునర్నిర్మించాలన్న ఆయన ఆలోచన ఏళ్లపాటు పక్కన పెట్టారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరాన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కుడ్యచిత్రం బాపూజీకి నిజమైన నివాళి అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు.
నిజం బతికున్నంత కాలం గాంధీ సజీవం
మహాత్మాగాంధీ లేరని హిందుత్వ వాదులు భావిస్తున్నారని, కానీ సత్యం బతికున్నంత కాలం జాతిపిత సజీవంగా ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బాపూజీ 74వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్‌లో ‘ఫరెవర్ గాంధీ’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ దగ్గరా రాహుల్ ఆదివారం జాతిపితకు అంజలి ఘటించారు. హిందుత్వవాదీ అయిన గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపాడని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘నేను నిరాశకు గురైనప్పుడు... సత్యం, ప్రేమ మాత్రమే గెలుస్తుందన్న చరిత్రను గుర్తు చేసుకుంటాను. కొంతకాలం పాటు అది కనిపించకుండా ఉండొచ్చు... హంతకులు, నిరంకుశులు మాత్రమే ఉండొచ్చు. కానీ చివరికి వాళ్లు ఓడిపోతారు. అది నిత్యం మనసులో ఉంచుకోండి’’ అన్న మహాత్ముడి కోట్‌ని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మహాత్మాగాంధీకి ట్విట్టర్‌లో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో మహాత్ముడికి ఘన నివాళులర్పించింది.
కాళీచరణ్‌కు ‘గాడ్సే భారత రత్న’
రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మసంసద్‌లో మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గత డిసెంబర్‌లో అరెస్టయి, గ్వాలియర్ జైల్లో ఉన్న మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌కు, మరో నలుగురు హిందూ మహాసభ నేతలకు ‘గాడ్సే–ఆప్టే భారతరత్న’ అవార్డును ప్రదానం చేసింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హిందూమహాసభ జాతిపితను హత్య చేసిన నాథురామ్ గాడ్సేకి నివాళులర్పించింది. గాంధీ హత్యకేసులో గాడ్సే సహనిందితుడు అయిన నారాయణ ఆప్టేకు నివాళిగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ను నిర్వహించింది. 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టేల అరెస్టుకు వ్యతిరేకంగా ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ నిర్వహిస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. మహాత్మాగాంధీకి జాతిపిత ఇవ్వడమేంటని మీరట్‌లోని హిందూ మహాసభ నేతలు ప్రశ్నించారు.
బాపూజీకి జాతి నివాళి
Published Mon, Jan 31 2022 6:29 AM | Last Updated on Mon, Jan 31 2022 6:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment