సాక్షి ముంబై: రాబోయే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆయా పార్టీల అధినేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్సీపీ మాత్రం ఈ సారి బీఎంసీ ఎన్నికల బాధ్యతలను పవార్ కుమార్తె పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే, శరద్ పవార్ మనుమడు, శాసన సభ సభ్యుడు రోహిత్ పవార్ అనగా మేనత్త అల్లుళ్లకు అప్పగించనున్నట్టు తెలిసింది.
ముఖ్యంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ ఆఘాడీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా శివసేనతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్సీపీ భావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ముంబైలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు సుప్రియా సూలే, రోహిత్ పవార్‌లు దృష్టి కేంద్రికృతం చేయనున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మలిక్ పేర్కొన్నారు.
ఇలా పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీరిద్దరిపై పార్టీ బాధ్యతలను మోపనుందన్న సంకేతాలు ఇచ్చినట్లయింది. మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉండటంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేస్తాయా..?లేదా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనేది వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment