సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ మెడికల్, నీట్ ఎండీఎస్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైన మూడు నెలల తర్వాత రాష్ట్రస్థాయి డేటాను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఎన్‌ఎంసీ నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలు అందినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయిN. నీట్ పీజీలో రాష్ట్రం నుంచి దాదాపు 12 వేల మంది పరీక్ష రాయగా 5,690 మంది అర్హత పొందారు. నీట్ ఎండీఎస్‌లో 602 మంది అర్హత సాధించినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
పీజీ మెడికల్ పరీక్ష మార్చి 5వ తేదీన జరిగింది. ఆ తర్వాత పది రోజులకు ఫలితాలు వచ్చాయి. వచ్చిన మార్కులు, జాతీయ స్థాయి ర్యాంకులను బట్టి విద్యార్థుల క్రమ సంఖ్య ఆధారంగా స్టేట్ ర్యాంకులు నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా తయారు చేసిందేనని, మెరిట్ జాబితా కాదని కాళోజీ వర్సిటీ తెలిపింది. నీట్ పీజీ మెడికల్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో వి.వి.కౌశిక్ అల్వార్, వేణు మాధవ్ పిన్నింటి, నంబూరి కృష్ణశ్రీ, జి.పవిత్ర, జీశన్ అహ్మద్ జాలీలి, రెగోటి అశ్రిత, తంగెడ కౌశిక్, కనుమిల్లి ప్రదీప్, బైరోజు శివ సాయితేజ, గడ్డం నిఖిత ఉన్నారు. నీట్ ఎండీఎస్ మొదటి పది స్థానాల్లో వర్ణిక పారుపల్లి, దుంప తేజస్వి, జె.కుసుమ, రుంజాల సుసన్ దైసీ క్రిస్, ముత్యాల శ్రీసాయి సుఖేష్ రొంపికుంట్ల శాలిని, మనీష కుమారి, సోమ చాణక్య, చర్క సౌమేశ్వరి, అక్షయ్ కులకర్ణి ఉన్నారు.
2,300కు పైగా క్లినికల్ సీట్లు..
రాష్ట్రవ్యాప్తంగా 32 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,722 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో దాదాపు 400 నాన్ క్లినికల్ సీట్లు పోగా, మిగిలినవి క్లినికల్ సీట్లు ఉంటాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 15% సీట్లను జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు తెలిపాయి.
కాగా వచ్చే నెలలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ ఇంటర్న్íÙప్ పూర్తి కాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది. కాగా పీజీ మెడికల్ క్లినికల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోట్లు ఖర్చు చేసి మరీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఆ సీట్లలో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. సీట్లు పొందినవారు స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. ఇక నాన్ క్లినికల్ పీజీ సీట్లను పట్టించుకునే వారే ఉండరు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. క్లినికల్ విభాగంలో మొత్తం 14 సబ్జెక్టులుండగా..నాన్ క్లినికల్‌లో 9 సబ్జెక్టులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment