ప్రపంచంలో దాదాపు సగం మందికి పౌష్టికాహారం లభించడం లేదు... ఇంకే, ఇందుకు కరోనానే కారణం అనుకుంటున్నారా? కాదు. ప్రపంచంలో ప్రతి సమస్యకు కరోనా కారణం కాదని, నిజానికి జనాలకు తగినంత హెల్తీ ఫుడ్ దొరక్కపోవడం కరోనా ముందునుంచే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.ఈ సమస్యను ఎదుర్కోవాలంటే సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది నిపుణుల మాట. మరి ప్రపంచ దేశాలు పట్టించుకుంటాయా? అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న!
ప్రపంచంలో ఒకపక్క అన్నమో రామచంద్రా అనేవారి కేకలు పెరిగిపోతుంటే, మరోపక్క పౌష్టికాహారం దొరక్క అలో లక్ష్మణా అనే వాళ్ల సంఖ్య అంతే వేగంగా పెరుగుతోంది. ఏదో తిన్నాం అంటే తిన్నాం అన్నట్లు కడుపునింపుకోవడమే తప్ప శరీరానికి సరిపడా పోషకాలనిచ్చే ఆహారం తీసుకునే వీలు చిక్కని వారి సంఖ్య 300 కోట్లను దాటిందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్ తదితర ఆంక్షలు ప్రపంచ ఎకానమీలను దెబ్బతీశాయి. ఇప్పటికీ పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిన పడలేదు. అనేక దేశాలు మాంద్యం దిశగా జారుకుంటున్నాయి. ఇదే తరుణంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పోషకాలు సమృద్ధిగా లభించే మొక్కజొన్న, పాలు, బీన్స్ తదితర చౌక ఆహార పదార్ధాలు సైతం సామాన్యుడికి అందకుండా పోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది ఇప్పుడు తలెత్తిన సమస్య కాదని, చాలా సంవత్సరాలుగా జనాభాను ఈ సమస్య పీడిస్తోందని న్యూట్రిషనిస్టులు, ఎకానమిస్టులు చెబుతున్నారు.
కరోనా మాత్రమే కారణమా?
ప్రపంచ ఆహార పదార్ధాల ధరలను విశ్లేషించే అధికారిక గణాంకాల ప్రకారం కరోనాకు ముందు ప్రపంచంలో పౌíష్టికాహారం అందనివారి సంఖ్య 40 శాతం ఉంది. అంటే ప్రస్తుత సంక్షోభానికి ముందు కూడా పౌష్టికాహార లోపం జనాభాలో అధికమనే తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సంపద కొందరి వద్దే పోగుపడడమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్పాదాయాలు, ఆహారపదార్ధాల అధిక ధరలు.. ఎన్నాళ్లుగానో దాదాపు సగం జనాభాను పీడిస్తున్న సమస్యలు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం దొరకకపోవడంతో ఎక్కువమంది అనీమియా, డయాబెటిస్ లాంటి వ్యాధులకు గురవుతున్నారు. మరి మిగిలిన 60 శాతం జనాభా ఓకేనా అంటే నిరాశాపూరిత సమాధానమే ఎదురవుతుంది. వీరికి పౌíష్టికాహారం లభించే అవకాశాలున్నా, వారంతా ఎల్లప్పుడూ మంచి ఆహారం తీసుకుంటున్నారని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. పోషకాలుండే పదార్ధాలు అందుబాటులో ఉండకపోవడం, ఆధునిక ఉద్యోగాల కారణంగా వంటకు సమయం చాలకపోవడం, అనారోగ్యకారక ఆహార పదార్ధాల ఉత్పత్తిదారులు చూపే ప్రకటనలకు మోసపోవడం, పోషకాల గురించి అవగాహన లేకపోవడం.. లాంటి కారణాలతో వీరికి కూడా పూర్తి న్యూట్రిషన్ అందడం లేదు. అంటే రమారమిన ముప్పావు శాతం ప్రపంచ జనాభాకు పౌíష్టికాహారం అందడం లేదన్నది నిపుణుల మాట.
ఏం చేయాలి?
అధికాదాయ ఉద్యోగాల కల్పన, అల్పాదాయ వర్గాలకు సామాజిక రక్షణలను విస్తృతీకరించడం, స్థానికంగా న్యూట్రిషన్ విలువలుండే ఆహారాల ఉత్పత్తి, సాగును ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు కనీస పౌష్టికాహారం అందించవచ్చని ప్రభుత్వాలకు నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాలోని ఎస్‌ఎన్‌ఏపీ కార్యక్రమాన్ని చూపుతున్నారు. ఈ ప్రోగ్రాం కింద అల్పాదాయ అమెరికన్లు తమకు కావాల్సిన ఆహారంలో కొంత కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సాయం చేస్తుంది. అయితే అన్ని దేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడం కష్టం కనుక, వీలయినంతగా ఆహార పదార్థ్ధాల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడమే ఉత్తమమని నిపుణుల సూచన. ఇందుకోసం వ్యవసాయ రంగ నూతన టెక్నాలజీల్లో పబ్లిక్ పెట్టుబడులు పెంచడం అవసరమంటున్నారు. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు ఈ ఏడాది జరగనున్న సదస్సుల్లో పౌష్ఠికాహార లభ్యతపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment