సదస్సులో పాల్గొన్న ఎస్. జై శంకర్, బిలావల్ భుట్టో
బెనౌలిమ్ (గోవా): అంతర్జాతీయ వేదికలపై వక్రబుద్ధి ప్రదర్శించే పాకిస్తాన్ తీరుపై విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ విశ్వసనీయత దాని విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే కూడా శరవేగంగా క్షీణిస్తోందంటూ దుయ్యబట్టారు. శుక్రవారం గోవాలో ముగిసిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) విదేశాంగ మంత్రుల భేటీ ఇందుకు వేదికగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భేటీలో లేవనెత్తారు.
దానిపై పునరాలోచన చేసేదాకా భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు పాక్ సిద్ధంగా లేదన్నారు. దాంతో భేటీ అనంతరం జై శంకర్ మీడియాతో మాట్లాడుతూ బిలావల్ వ్యాఖ్యలను తూర్పారబట్టారు. ‘‘ఆర్టికల్ 370 ముగిసిన చరిత్ర. ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కొని వాస్తవాలు గమనించండి’’ అంటూ చురకలు వేశారు. బిలావల్ ‘ఉగ్రవాదానికి ప్రోత్సాహకుడు, సమర్థకుడు, అధికార ప్రతినిధి’గా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు! తామూ ఉగ్రవాద బాధితులమేనన్న బిలావల్ వ్యాఖ్యలపైనా జై శంకర్ తీవ్రంగా స్పందించారు.
పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, పాక్ చేతులు కలుపుతాయా అని ప్రశ్నించగా, ఉగ్రవాద బాధితులు ఎప్పుడూ ఉగ్రవాదానికి పాల్పడిన వారితో కలిసి ఉగ్రవాదంపై చర్చించడానికి కూర్చోరని బదులిచ్చారు. చేశారు. జీ 20 సన్నాహక సమావేశాలను జమ్మూ కశ్మీర్‌లో జరపడంపై బిలావల్ లేవనెత్తిన అభ్యంతరాలనూ కొట్టిపారేశారు.
‘‘అసలు జీ 20 భేటీలతో మీకేం సంబంధం? దానికంటే, జమ్మూ కశ్మీర్లో మీరు ఆక్రమించుకున్న భూభాగాలను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న దానిపై మాట్లాడితే బాగుంటుంది’’ అంటూ వాతలు పెట్టారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. ‘‘మేమేదో పాక్‌పై దౌత్యపరంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం లేదు. ఆ దేశం అసలు రంగును రాజకీయంగా, దౌత్యపరంగా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతున్నాం’’ అని వివరించారు.
ఉగ్రమూలాల్ని పెకిలించాలి
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సమూలంగా నాశనం చేయాలని ఎస్‌సీఓ భేటీలో జై శంకర్ పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదం ఇప్పటికీ కొనసాగుతోంది. దానినెవరూ సమర్థించరాదు. ప్రభుత్వాల సాయంతో తెరవెనుక సాగే సీమాంతర ఉగ్రవాదం సహా ఏరూపంలో ఉన్నా అరికట్టాలి’’ అని పాక్‌నుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రమూకల ఆర్థిక మూలాలను సమూలంగా నాశనం చేయాలన్నారు. ఇది ఎస్‌సీవో లక్ష్యాల్లో ఒకటని గుర్తు చేశారు.
సభ్య దేశాల శాంతి, సుస్థిరతలకు భారత్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుందన్నారు. ద్వైపాక్షిక అంశాలను ప్రస్తావించరాదనే ఎస్‌సీవో నిబంధనలను ఉల్లంఘించకుండానే పాక్‌కు మంత్రి తలంటారు. బిలావల్ మాట్లాడుతూ దౌత్యపరమైన అంశాల్లో ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకోరాదన్నారు. ‘‘ఈ సమస్యను రాజకీయాల నుంచి వేరు చేసి అందరూ కలిసికట్టుగా పోరాడాలి. నేనూ ఉగ్రవాద బాధితుడినే. నా తల్లి బేనజీర్ భుట్టో ఉగ్రవాదానికి బలయ్యారు’’ అన్నారు.
నమస్కారంతోనే భుట్టోకు పలకరింపు
భారత్ సారథ్యంలో ఎస్‌సీవో సదస్సుకు హాజరైన పాక్ మంత్రి భుట్టో తదితర సభ్య దేశాల విదేశాంగ మంత్రులకు ఎస్.జై శంకర్ తాజ్ ఎగ్జోటికా రిసార్టులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద నమస్తేతో స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం హోటల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో మాత్రం భుట్టో సహా అతిథులందరితోనూ మంత్రి జై శంకర్ కరచాలనం చేశారు. కార్యక్రమంలో రష్యా, చైనా విదేశాంగ మంత్రులు వరుసగా బిలావల్ భుట్టో, సెర్గీ లావ్‌రోవ్, క్విన్ గాంగ్‌తోపాటు ఖజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మంత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment