సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. మణిపూర్‌లో హింసాకాండ, ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానం సహా ఇతర అంశాలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దుచేసి, మొదటి అంశంగా మణిపూర్ హింసపైనే చర్చించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్
పార్లమెంట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మరణించిన సభ్యులకు నివాళులరి్పంచిన కొద్ది నిమిషాలకే రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు, లోక్‌సభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. అంతకంటే ముందు మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ తరపున మాణిక్యం ఠాగూర్, ఆప్ నేత సంజయ్ సింగ్, బీఆర్‌ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, ఎంఐఎం నుంచి ఒవైసీ, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం వాయిదా తీర్మానిచ్చారు.
మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, టీఎంసీ సహా ఇతర విపక్షాల సభ్యులు మణిపూర్ హింసపై చర్చించాలని కోరారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని ప్రాధాన్యతగా చర్చకు చేపట్టాలని, దీనిపై మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. టీఎంసీ నేత డెరిక్ ఓబ్రియన్ సైతం ఆయనకు మద్దతు పలికారు. ఛైర్మన్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది.
సభ తిరిగి ఆరంభమైన తర్వాత కూడా ఖర్గే మరోసారి తమ నోటీసులపై చర్చించాలని కోరారు. ఆయన మైక్‌ను కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభాపతి జగదీప్ ధన్‌ఖడ్ సభను శుక్రవారానికి వాయిదావేశారు. ఇక లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమైన తర్వాత మణిపూర్ హింసపై విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు.
చర్చకు సిద్ధమే: పీయూష్ గోయల్
విపక్షాల ఆందోళనపై రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ స్పందించారు. ‘‘పార్లమెంట్ సక్రమంగా కొనసాగకూడదన్నదే ప్రతిపక్షాల ఉద్దేశంగా కనిపిస్తోంది. మణిపూర్ సంఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసినా.. నిబంధనల ప్రకారం చర్చ జరగనివ్వకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి’’ అని ఆక్షేపించారు.
సోనియా ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు లోక్‌సభలో ప్రధాని మోదీ విపక్ష నేతలను పలకరించారు. వారి యోగక్షేమాలను విచారించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీతో కొద్దిసేపు మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ హింసాకాండపై లోక్‌సభలో చర్చించాలని ప్రధాని మోదీని సోనియా కోరారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment