పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్‌ను ముంబైలోని అలీబాగ్‌లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్‌మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.
హర్‌దిన్‌శుభ్‌హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్‌లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అన్‌లాక్‌లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. హర్‌దిన్‌శుభ్‌హై కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్‌లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment