భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎవరి ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.
జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్ లాల్ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ బృందం జహంగీరాబాద్‌లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
Comments
Please login to add a commentAdd a comment