
ప్రణబ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడి ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు తానిచ్చిన దానికంటే వారి నుంచి తాను ఎంతో పొందానని నాన్న తరచూ చెబుతుండేవారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన ప్రజలను కోరారు. ఢిల్లీలోని ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి 96 గంటల అబ్జర్వేషన్ వ్యవధి శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు. ప్రణబ్‌జీ చికిత్సకు స్పందిస్తున్నారని అభిజిత్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారిన సంగతి తెలిసిందే.
అయితే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని, ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. రక్తపోటు, మధుమేహం సహా కీలక ఆరోగ్య సంకేతాలన్నీ నిలకడగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించలేదని, ప్రణబ్‌జీ కళ్లలో కొంత మెరుగుదల కనిపించిందని ఆయన కుమార్తె షర్మిష్ట పేర్కొన్నారు. కాగా బ్రెయిన్ సర్జరీకి ముందు తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రణబ్ సత్వరమే కోలుకోవాలని బెంగాల్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఇక బీర్బం జిల్లాలో ఆయన బంధువులు మూడు రోజుల పాటు మృత్యుంజయ హోమం జరిపారు.