సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనం ధరించిన మాస్కును తాకగానే నిర్వీర్యమైపోతే? కోరలు తీసిన పాములా శక్తిహీనమైపోతే? సూపర్ కదా... మనకు డబుల్ రక్షణ లభించినట్లే. వైరస్‌ను సంహరించే ఔషధ మిశ్రమాలను కలగలిపి... త్రీడీ ప్రింటెడ్ మాస్కులను రూపొందించి పుణె కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ. సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్ ఆధారిత రసాయనమిశ్రమం దీంట్లో వాడారు. ఇది వైరస్ పైపొరను ధ్వంసం చేస్తుంది. ఈ మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. ‘‘ఇళ్లలో తయారవుతున్న మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ వీటి నుంచి సరైన రక్షణ లేదు.
ఇన్ఫెక్షన్ నివారణకు మరింత సమర్థంగా పనిచేసే మాస్కుల రూపకల్పనపై దృష్టి సారించి 3డీ ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును అభివృద్ధి చేశాం. ఔషధ మిశ్రమాలను మాస్కుపై పైపూతగా చేర్చి వినూత్నంగా మాస్కు రూపొందించాం. ఈ మాస్కులు వైరస్ నుంచి అదనపు రక్షణను అందిస్తాయి. ఈ మాస్కులు బ్యాక్టీరియాను 95 శాతం నిరోధిస్తాయని పరీక్షల్లో వెల్లడైంది’’ అని థింకర్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శీతల్‌కుమార్ జాంబాద్ వివరించారు. కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కోవడానికి వినూత్న విధానాలు రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ 2020 మేలో పరిశోధనలను చేపట్టడానికి థింకర్ టెక్నాలజీస్‌కి నిధులను సమకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment