
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కోవిడ్ మరణాలకు ప్రధాని మోదీ కన్నీరు కార్చడమే కేంద్ర ప్రభుత్వం స్పందన అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 212 కోవిడ్ మరణాలు సంభవించగా, వియత్నాంలో ఇది 0.4, చైనాలో 2 మరణాలు మాత్రమే నమోదైనట్లు వివరించారు.
అదేవిధంగా, దేశ జీడీపీ ప్రస్తుతం –8కి పడిపోగా ఇదే సమయంలో పొరుగునున్న బంగ్లాదేశ్ జీడీపీ 3.8, చైనా 1.9, పాకిస్తాన్ 0.4గా ఉందంటూ ఆర్థిక వేత్త కౌశిక్ బసు ట్వీట్ చేసిన చార్ట్‌ను కూడా రాహుల్ షేర్ చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వైద్యులతో వర్చువల్ సమావేశం సందర్భంగా దేశంలో కోవిడ్ మరణాలపై ఉద్వేగంతో కంట తడిపెట్టడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలన ఫలితంగానే కోవిడ్‌కు బ్లాక్‌ఫంగస్ మహమ్మారి తోడైందన్నారు. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు మోదీ చప్పట్లు, కంచాలతో చప్పుళ్లు చేయాలని ప్రజలను కోరనున్నారని ఎద్దేవా చేశారు.
(చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’)