సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్‌లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు.
ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment