జైపూర్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కాగా, ఇప్పటికే అనేక ఆసుపత్రులలో కరోనా బాధితుల తాకిడి ఎక్కువైంది. వారికి సరైన బెడ్‌లు, ఆక్సిజన్, వ్యాక్సిన్‌లు సదుపాయం కల్పించలేక చాలా ఆసుపత్రులు ఇప్పటికే చేతులేత్తాశాయి. ఇదిలా ఉండగా, కరోనా బాధితులను ఆసుపత్రులకు చేర్చే అంబులెన్స్‌ల కోరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. కాగా ఈ కష్టకాలంలో కొంత మంది ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ డ్రైవర్‌లు ఎక్కువ డబ్బులను వసూలు చేస్తూంటే మరోవైపు కొంత మంది కరోనా బాధితులకు తమ కున్న పరిధిలో సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
వివరాలు.. రాజస్తాన్‌లోని కోటా నగరానికి చెందిన అయిదుగురు మిత్రులు తమ లగ్జరీ కార్లను కోవిడ్ అత్యవసర ఆసుపత్రిగా మార్చారు. కాగా, కోటా పట్నంలో కార్ సర్వీస్ సెంటర్ ను నిర్వహించే చందేష్ గుహిజా తన చుట్టు ఉన్న ప్రజలకు ఆక్సిజన్ కోసం పరుగెత్తడం చూసి చలించిపోయాడు. వెంటనే తన మిత్రులు ఆశిష్‌సింగ్, భారత్ సమ్నాని, రవికుమార్ లతో పంచుకున్నాడు. వీరంతా కలసి బాధితుల కోసం ఏదైనా సహయం చేయాలనుకున్నారు. వారి ఆలోచనను వెంటనే అమలులోకి తీసుకొచ్చారు. వెంటనే, వారి మూడు లగ్జరీకార్లను అత్యవసర ఆసుపత్రిగా మార్చేశారు. దీనిలో బెడ్, ఆక్సిజన్, మందులు, ఇతర సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న మరో రెండు కార్లను అంబులెన్స్‌గా మార్చారు. వీటిల్లో ఆక్సిజన్ కిట్ కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం ప్రతిరోజు రూ. 5000 నుంచి 7000 వేల వరకు ఖర్చువుతుందన తెలిపారు.
తమ కారులో అమర్చిన ఒక సిలెండర్‌తో ముగ్గురు రోగులకు ఆక్సిజన్‌ను అందించగలదని తెలిపారు. గడచిన 10, 12 రోజుల నుంచి రోగుల కుటుంబాలకు ఉచితంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు ఉచితంగా చేర్చే వాహనాల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. కాగా, తమ సేవలను కోరుకునేవారి కోసం కొన్ని నెంబర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మీ మానవత్వానికి హ్యట్సాఫ్.. మీ ఆలోచన బాగుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ కామెంట్‌లు పెడుతున్నారు. కాగా, గతంలో రాంచీకి చెందిన ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన ఆటోను కరోనా బాధితుల కోసం అంబులెన్స్‌గా మార్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment