రాజ్యాంగ ప్రతితో అసెంబ్లీకి వెళ్తున్న సీఎం
డెహ్రాడూన్: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్‌పాల్ ఆర్య మండిపడ్డారు.
యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది?
► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది.
► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు.
► భారత రాజ్యాంగంలోని పార్ట్–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది.
► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది.
► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు.
► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.
► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు.
► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి.
► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.
► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు.
► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment