గయ: బీహార్‌లోని గయలో జన్ సూరజ్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పిలుపు మేరకు సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు గలాటా సృష్టించారు. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది.
వివరాల్లోకి వెళితే గయలోని బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు పీకే గతంలో ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఈ సమావేశంలో ఈ స్థానానికి టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు తొలుత తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనిని గమనించిన ప్రశాంత్ కిషోర్ స్టేజి మీద నుంచి వారిని వారించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాటలను అక్కడున్నవారెవరూ పట్టించుకోలేదు. పైగా కుర్చీలు విసురుకుంటూ ఎవరికి దొరికిన దాన్ని వారు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
దీనికి ముందు తొలుత బెలగంజ్ ఉప ఎన్నిక కోసం నాలుగు పేర్లను ప్రతిపాదించారు. వీరిలో అమ్జద్ హసన్, ప్రొ. ఖిలాఫత్ హుస్సేన్, డానిష్ ముఖియా, ప్రొ. సర్ఫరాజ్ ఖాన్‌లున్నారు. ఈ సమావేశంలో, అమ్జద్ హసన్‌కు మద్దతు పలుకుతూ డానిష్ ముఖియా తన పేరును ఉపసంహరించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. దీంతో అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల పేర్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బెలగంజ్ టిక్కెట్‌ను ఖిలాఫత్ హుస్సేన్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మాట వినగానే అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల మద్దతుదారులు కుమ్ముటాటకు దిగారు.
ఇది కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
Comments
Please login to add a commentAdd a comment