వైద్య విద్యకు... చలో ఫారిన్‌ | Russia-Ukraine war impact on medical students | Sakshi
Sakshi News home page

వైద్య విద్యకు... చలో ఫారిన్‌

Published Mon, Mar 28 2022 4:23 AM | Last Updated on Mon, Mar 28 2022 4:23 AM

Russia-Ukraine war impact on medical students  - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ మెడిసిన్‌ చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను కేంద్రం హుటాహుటిన స్వదేశానికి తీసుకొచ్చింది. దాంతో విదేశాల్లో వైద్య విద్యపై మరోసారి చర్చ ఊపందుకుంది. ఉక్రెయిన్‌తో పాటు రష్యా, చైనా తదితర దేశాల్లో లక్షలాది మంది భారత విద్యార్థులు మెడిసిన్‌ చదువుతున్నారు. మన దగ్గర మెడిసిన్‌ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది...

భారత్‌లో డాక్టర్‌ చదువు అంత ఈజీ కాదు. ప్రతిభ ఒక్కటే సరిపోదు. విపరీతమైన పోటీని ఎదుర్కోవాలి. దానికి తోడు బాగా డబ్బు కూడా ఉండాలి. మన దేశంతో పోల్చి చూస్తే పలు దేశాల్లో కారు చౌకగా మెడిసిన్‌ చదువుకునే అవకాశాలుండటంతో మన విద్యార్థులు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో 88,120 అండర్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లున్నాయి.

వీటిలో 284 ప్రభుత్వ కాలేజీల్లో 43,310 సీట్లు, 269 ప్రైవేటు కాలేజీల్లో 41,065 సీట్లున్నాయి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో జరిగే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కి గతేడాది ఏకంగా 15.44 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 8.7 లక్షల మంది పాసయ్యారు. అయినా వీరిలో సీటు దొరికేది 10 శాతం మందికే. అర్హులకు, అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య భారీ అంతరముంది.

ఖర్చు తడిసిమోపెడు  
దేశవ్యాప్త పోటీని తట్టుకొని నీట్‌లో మంచి మార్కులు సంపాదించినా ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర మెడిసిన్‌ కోర్సుకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అందులోనూ ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌ చదివించాలంటే కనీసం రూ.50 లక్షల నుంచి కోటికి పైగా కావాల్సిందే. అదే ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో రూ.20 నుంచి రూ.30 లక్షల్లోపే పూర్తవుతుంది.

ప్రాక్టీసూ కష్టమే
ఎంబీబీఎస్‌ తర్వాత మన దేశంలో డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేయాలంటే నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఏ) నిర్వహించే ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) రాయాలి. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్‌కు అవకాశం వస్తుంది. అయితే అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండుల్లో మెడిసిన్‌ చదివేవారు ఈ పరీక్షతో పని లేకుండా భారత్‌లో నేరుగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. రష్యా, చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, నేపాల్, కజకిస్తాన్, ఉక్రెయిన్‌ మెడికోలు మాత్రం ఈ పరీక్ష పాసై తీరాలి. ఏటా 13 వేల మందికి పైగా పరీక్షలో రాస్తుండగా 15 శాతానికి మించి పాసవడం లేదు.

విదేశాలకు వెళ్లడం ఇక ఈజీ కాదు
మోదీ ప్రభుత్వం నీట్‌ ప్రవేశపెట్టాక విదేశాల్లో ఎంబీబీఎస్‌ డిగ్రీ చదవడం కష్టతరంగా మారింది. నీట్‌లో కనీసం 119 మార్కులు వస్తేనే విదేశాల్లో కూడా వైద్య విద్యకు అర్హులవుతారు. దీంతో కొన్నేళ్లుగా మెడిసిన్‌ కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గింది. నీట్‌ నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారే విదేశాలకు వెళ్లగలుగుతున్నారని ఎఫ్‌ఎంజీఈ కోచింగ్‌ సెంటర్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ నీరజ్‌ చౌరాసియా అన్నారు. ప్రతిష్ట కోసం విదేశాల్లో డాక్టర్‌ చదవాలనుకునే వారికి అడ్డుకట్ట పడ్డట్టేనని అభిప్రాయపడ్డారు.

అంతటా మనవాళ్లే
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం పలు దేశాల్లో ప్రాక్టీసు చేస్తున్న వైద్యుల్లో లక్షకు పైగా భారత్‌లో శిక్షణ పొందిన వారే ఉన్నారు. ఒక్క అమెరికాలోనే 50 వేల మందికి పైగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఐదుగురు వైద్యుల్లో ఒకరు, కెనడాలో ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే. ఇంగ్లండ్‌లో రిజిస్టర్డ్‌ వైద్యుల్లో తొమ్మిది శాతం అంటే 40 వేలకు పైగా భారతీయులేనని అంచనా.

బంగ్లాదేశ్‌ భేష్‌  
ఎఫ్‌ఎంజీఈ రాసేవారిలో బంగ్లాదేశ్‌ ఎంబీబీఎస్‌ డిగ్రీ హోల్డర్లు అద్భుతంగా రాణిస్తూ టాపర్లుగా నిలుస్తున్నారు. భారత్‌లో మాదిరి సిలబసే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. చైనా, ఉక్రెయిన్, రష్యాలో చదివిన విద్యార్థులు అట్టడుగున నిలుస్తున్నారు.

భారత్‌లోనే చదివేలా ఆదేశాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో మధ్యలో ఆగిన తమ వైద్య విద్యను భారత్‌లో పూర్తి చేసేందుకు వీలు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుర్రా విద్య, సునీత రాజ్‌ సహా 50 మంది విద్యార్థుల తరఫున న్యాయవాది రమేశ్‌ అల్లంకి ఈ మేరకు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అందులో పేర్కొన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కూడా కోరారు.

ఉక్రెయిన్లో మెడిసిన్‌ ఫోర్త్‌ ఇయర్‌ చదువుతున్నా. ఆర్థికంగా కలిసొస్తుందనే అంత దూరం వెళ్లా. ఏపీ ప్రభుత్వం అండగా నిలిచి, కేంద్రంతో సమన్వయం చేసుకుని క్షేమంగా తిరిగొచ్చేలా చూసింది.     
– రేష్మ, తెనాలి

రెండుసార్లు నీట్‌ రాసినా బీడీఎస్‌లో సీటొచ్చింది. ఎంబీబీఎస్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లాను. అక్కడ ఏటా రూ.4 లక్షలవుతుంది. ఇక్కడైతే ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చేతికి రావాలంటే కోటి దాకా పెట్టాలి.
దుష్యంత్, గుమ్ములూరు, మహబూబాబాద్‌

మా తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్నా. ఫస్టియర్లో ఉన్నా. తిరిగొచ్చాక ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నా భవిష్యత్తు ఏమిటో అయోమయంగా ఉంది.
– కుడుపూడి భవ్యన, అమలాపురం, తూర్పుగోదావరి

మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు కొనలేక మా నాన్న అప్పు చేసి ఉక్రెయిన్‌ పంపారు. ఉక్రెయిన్‌ వర్సిటీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. కానీ డాక్టర్‌ కోర్సు ఆన్‌లైన్‌లో చదవడం చాలా కష్టం. తెలంగాణ ప్రభుత్వం మాకు నేరుగా ఎంబీబీఎస్‌లో సీటివ్వాలి.
– బుస్రా, సానియా (అక్కాచెల్లెళ్లు) మాలపల్లి, నిజామాబాద్‌

– నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement