లక్నో: కొందరు అల్లరిమూకలు వందేభారత్ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారనే వార్తలను అప్పుడప్పుడు మనం వింటుంటాం. తాజాగా గడచిన 24 గంటల్లో రెండు వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటి సంఘటన బుధవారం రాత్రి యూపీలోని లక్నో- పట్నా వందే భారత్‌పై జరగగా, రెండవ ఘటన గురువారం ఉదయం రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై జరిగింది.
బుధవారం రాత్రి లక్నో నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలుపై అల్లరి మూకలు భారీగా రాళ్లు రువ్వారు.ఈ దాడి కారణంగా రైలులోని సీ-5 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. యూపీలోని వారణాసి స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. రైల్వేశాఖ కూడా విచారణ చేపట్టింది.
ఇదేవిధంగా జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందే భారత్ రైలుపై గురువారం ఉదయం రాళ్ల దాడి జరిగింది. 24 గంటల్లోనే రెండు వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. రాంచీ నుంచి పట్నా వెళ్తున్న వందేభారత్ రైలు నంబర్ 22350లోని బోగీ నంబర్ ఈ వన్‌పై రాళ్ల దాడి జరిగింది. ఇందులో ఐదు, ఆరో నంబర్ సీట్ల సమీపంలోని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన హజారీబాగ్‌లోని చార్హి- బేస్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది.
ఈ రాళ్లదాడిలో కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో రైలులో కూర్చున్న ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేశాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీల ద్వారా అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment