కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్‌ | Supreme Court forms National Task Force for transparent oxygen allocation | Sakshi
Sakshi News home page

కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్‌

Published Sun, May 9 2021 4:44 AM | Last Updated on Sun, May 9 2021 4:44 AM

Supreme Court forms National Task Force for transparent oxygen allocation - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల విజృంభణ, ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు, ఆక్సిజన్‌ పంపిణీ కోసం స్పష్టమైన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు 6 నెలల కాలపరిమితితో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులైన 12 మందిని అందులో సభ్యులుగా చేర్చింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రణాళికను రూపొందించే బాధ్యతను కూడా ఆ కమిటీకి అప్పగించింది. అలాగే, ఎయిమ్స్‌కు చెందిన రణదీప్‌ గులేరియా, మాక్స్‌ హెల్త్‌కేర్‌కు చెందిన సందీప్‌ బుధిరాజా, సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని ఇద్దరు ఐఏఎస్‌ అధికారులతో ఒక సబ్‌ కమిటీని కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరా, నగరంలో వైద్య వ్యవస్థ మౌలిక వసతులను ఆ కమిటీ సమీక్షిస్తుంది.

విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారం
జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు కన్వీనర్‌గా కేంద్ర కేబినెట్‌ సెక్రటరీని, ఎక్స్‌ అíఫీషియో మెంబర్‌గా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిని జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం నియమించింది. ఈ మేరకు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో శనివారం అప్‌లోడ్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌లో బాబాతోష్‌ బిశ్వాస్‌(వెస్ట్‌బెంగాల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌), దేవేందర్‌ సింగ్‌ రాణా(ఢిల్లీ్లలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ చైర్‌పర్సన్‌), దేవీప్రసాద్‌ శెట్టి(బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్‌ చైర్‌పర్సన్, ఈడీ), గగన్‌దీప్‌ కాంగ్‌(వెల్లూర్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌) తదితరులున్నారు.  కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే శాస్త్రీయ ప్రణాళికలను టాస్క్‌ఫోర్స్‌ నిపుణులు రూపొందిస్తారని, అలాగే, విధాన నిర్ణయాలు తీసుకునేవారికి శాస్త్రీయ సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఎప్పటికప్పుడు మధ్యంతర నివేదికలు
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవసరాల మేరకు ఆక్సిజన్‌ డిమాండ్, సరఫరాలపై శాస్త్రీయ అంచనా సహా 12 విధులను కోర్టు ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఇందుకు రాష్ట్రాల వారీగా సబ్‌ కమిటీలను టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తుందని తెలిపింది. ఈ సబ్‌ కమిటీల్లో ఆయా రాష్ట్రాల కార్యదర్శి స్థాయి అధికారి, అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. పేషెంట్ల చికిత్స సమయంలో వైద్యులు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం ఈ కమిటీ ఏర్పాటు వెనుక ఉద్దేశం కాదని, మెడికల్‌ ఆక్సిజన్‌ పంపిణీ, వినియోగంలో పారదర్శకత నెలకొనాలని, అవసరాల మేరకు ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సరఫరా జరగాలనేదే తమ ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ నివేదికను సమర్పించేంతవరకు.. రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తమకు మధ్యంతర నివేదికలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement