న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. పరిధిలో పునర్నిర్మాణం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకి 2–1 ఓట్ల తేడాతో మంగళవారం సుప్రీం బెంచ్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పర్యావరణ అనుమతులు, భూ కేటాయింపుల్ని మారుస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, ప్రాజెక్టు డిజైన్‌కు సంబంధించి కేంద్రం చేసిన వాదనలతో ఏకీభవించింది. పర్యావరణ శాఖ అనుమతులు సహా అన్నింటిని పూర్తిగా సమర్థించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలు కేంద్రం వాదనలతో ఏకీభవించగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యతిరేకించారు.
స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలి
పాత భవనాల కూల్చివేత, కొత్త భవన నిర్మాణ సమయంలో పర్యావరణ ప్రతికూలతలపై పడే ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో కాలుష్య నియంత్రణ కోసం స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరిగా తెచ్చుకోవాలని అప్పటివరకు నిర్మాణ పనులు మొదలు పెట్టవద్దని సుప్రీం ఆదేశించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. పార్లమెంటు, సచివాలయం కొత్త భవనాల నిర్మాణం కోసం కేంద్రం సెప్టెంబర్ 2019ని ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది. కొన్ని భవనాలను యథాతథంగా ఉంచి , మరికొన్నింటిని తిరిగి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
అయితే ఈ ప్రాజెక్టు డిజైన్, పర్యావరణ అనుమతులు, స్థలం కేటాయింపులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పర్యావరణ అనుమతులు చట్టబద్ధంగా లేవని పలువురు కోర్టుకెక్కారు. కోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉండగానే సుప్రీంకోర్టు భవనాలకి శంకుస్థాపన చేయడానికి అనుమతినిచ్చింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణం చేపట్టరాదని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment