ఢిల్లీ: ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు ఆ తరహా పీడిత రాష్ట్రాలేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. జమ్ము కశ్మీర్ విభజనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
‘‘జమ్ము కశ్మీర్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లే.. ఇరత రాష్ట్రాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అధికారం పార్లమెంట్‌కు, కేంద్రానికి ఉంటుందా?’’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇవ్వగా.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జోక్యం చేసుకున్నారు.
జమ్ము కశ్మీర్‌లోనే కాదు.. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ జమ్ము తరహా పరిస్థితులు చూస్తున్నాం కదా అని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ గవాయి సైతం మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లను ప్రశ్నించారు. కేవలం సరిహద్దు రాష్ట్రం గనుకే ప్రత్యేకంగా భావించాం గనుకే విభజించాం అనే సమాధానం ఇవ్వకండి అంటూ జస్టిస్ కౌల్ అసహనం ప్రదర్శించారాయన.
అయితే.. దశాబ్దాల కాలం నుంచి జమ్ము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందని. పైగా పీవోకేతో సరిహద్దు పంచుకుంటోందని, జమ్ము విషయంలో కేంద్రం తొందరపాటు ప్రదర్శించలేదు. విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుందని. ఒకవేళ గుజరాతో, మధ్యప్రదేశ్‌లను విభజించాల్సి వస్తే.. అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సాలిసిటర్ జనరల్ బెంచ్‌కు వివరించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కలగజేసుకుని.. ‘‘ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించిన తర్వాత.. ఆ అధికార దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేంద్రానికో.. లేదంటే పార్లమెంట్‌కో.. ఇప్పుడున్న ప్రతీ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానో.. విభజన చేయగల అధికారమో ఉందా? అని ప్రశ్నించారు.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 విషయంలో రాజ్యాంగ పరిషత్(పార్లమెంట్) పాత్ర కేవలం సిఫార్సు పాత్రను కలిగి ఉంటుంది. అలాగని అది రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేసేదిగా ఉండకూడదు అని రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇక.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరగా.. సెప్టెంబర్ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం అప్పట్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment