న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్నలు వేసింది.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. బాధిత మహిళల తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మణిపూర్లో ఇప్పటివరకు చాలా మంది చనిపోయారు.
ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బదిలీ చేయవద్దంటున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున కేసును వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు.
బాధితుల్లో ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ కుటుంబానికి ఆ మృతదేహాలను అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కపిల్ సిబాల్. మే 18న ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. కేసు విచారణ విషయమై హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
చదవండి: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట..
Comments
Please login to add a commentAdd a comment