సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా కాకుండా.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేసేలా లోక్‌సభ సెక్రటేరియెట్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అయితే.. ఇందులో జోక్యం చేసుకోలేమంటూ పిల్‌ను కొట్టేసింది సుప్రీం కోర్టు.
మే 18వ తేదీన లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన ఒక ప్రకటనతో పాటు లోక్‌సభ స్పీకర్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఇచ్చిన ఆహ్వానం.. రాష్ట్రపతిని అవమానించడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ అడ్వొకేట్ జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. దీనిని శుక్రవారం వెకేషన్ బెంచ్ పరిశీలనకు తీసుకుంది.
అయితే.. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ఉల్లంఘన(పార్లమెంటు రాజ్యాంగాన్ని వివరించేక్రమంలో.. ఉభయ సభలకు రాష్ట్రపతి ప్రతినిధిగా ఉంటారని వివరిస్తుంది) కిందకు ఎలా వస్తుందని, ఒక న్యాయవాదిగా అది రుజువు చేయాలని జస్టిస్ జేకే మహేశ్వరి కోరారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందునా.. ఫైన్ విధిస్తామని సున్నితంగా మరో జస్టిస్ నరసింహ సున్నితంగా హెచ్చరించారు. ఈ తరుణంలో పిటిషన్ వెనక్కి తీసుకునేందుకే మొగ్గు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment