పరోక్షంగా సీఎం స్టాలిన్ సంకేతం
కొళత్తూరులో విస్తృతంగా పర్యటన
ఎంతటి వర్షానైనా ఎదుర్కొంటామని ధీమా
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవీ ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది. స్వయంగా సీఎం స్టాలిన్ పరోక్ష వ్యాఖ్యలతో ఈ అంశం స్పష్టమవుతోంది. వివరాలు.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చైన్నె కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం సీఎం స్టాలిన్ విస్తృతంగా పర్యటించారు. రూ. 8.45 కోట్లతో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించారు. గణేష్ నగర్‌లో పాఠశాల పనులకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్, తదితర పనులను పరిశీలించారు. పెరియార్ నగర్ రూ. 355 కోట్లతో జరుగుతున్న ప్రభుత్వ సబర్బన్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వీక్షించారు.
తమిళనాడు పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తరపున రూ.110 కోట్లతో జరుగుతున్న అతి పెద్ద విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీనస్ నగర్‌లో రూ.19.56 కోట్లతో సాగుతున్న మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. చైన్నె 2.0 పథకం కింద రూ.5.4 కోట్లతో ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి నిర్మాణాలకు ఈసందర్భంగా శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని ఆయన అందజేశారు.
అనంతరం ఆధునిక మార్కెట్ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు . జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఐనావరం, మాధవరం సర్కిల్‌లో రూ. 91.36 కోట్లతో సాగుతున్న కాలువ నిర్మాణ పనులు, వరద నివారణ పనులను వీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు ఎం.సుబ్రమణి యన్, పీకే శేఖర్‌బాబు, మేయర్ ఆర్. ప్రియా, ఎంపీ కళానిధి వీరాస్వామి తదితరులు ఉన్నారు.
డిప్యూటీపై పరోక్ష వ్యాఖ్య
డీఎంకే యువజన నేత, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న నినాదం పార్టీలో మిన్నంటుతున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉదయనిధికి డిప్యూటీ పదవి అప్పగించి పరిపాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టించబోతున్నట్టుగా చర్చ జోరందుకుంది. అయితే ఈ పదవీ విషయంగా ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడే సమయంలో అన్నీ ప్రచారాలే అని పేర్కొంటూ వచ్చారు. అదే సమయంలో తనకు ఏ బాధ్యత అప్పగించినా, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవే తనకు కీలకం అని పేర్కొంటూ వచ్చారు.
ఈ పరిస్థితులలో కొళత్తూరు పర్యటన సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను మీడియా డిప్యూటీ పదవి విషయంగా ప్రశ్నించింది. ఆయనకు ఆ పదవి అప్పగిస్తారా? మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయా? అని ప్రశ్నించగా, నినాదం బలంగానే ఉన్నా.. పండు కాలేదుగా అని పేర్కొంటూ డిప్యూటీ ప్రచారంతోపాటు మంత్రి వర్గంలో మార్పులనే ప్రచారానికీ చెక్ పెట్టారు. అలాగే వర్షాల గురించి మాట్లాడుతూ, ఎంతటి భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment