న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులేనంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009లో ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రశాంత్ భూషణ్ తండ్రి, సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్ కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత కోర్టు భౌతిక విచారణ ప్రారంభమైనప్పుడు ఈ కేసును విచారించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. (రామోజీరావుకు సుప్రీం నోటీసులు)
2009లో తెహల్కా మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులే ఉన్నారంటూ ఆరోపించారు. ఈ కేసుతో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై నమోదైన మరో కోర్టు ధిక్కరణ కేసును కూడా సుప్రీంకోర్టు విచారిస్తున్నది. చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేపై ప్రశాంత్ భూషణ్ ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద రీతిలో కామెంట్ చేశారు. బాబ్డే బైక్ తొలడాన్ని తప్పుపడుతూ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛకు, కోర్టు ధిక్కరణకు స్వల్ప తేడా ఉన్నట్లు సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. (మాల్యా కేసు : సంచలన ట్విస్టు)
ఈ క్రమంలో ‘16 మంది ప్రధాన న్యాయమూర్తులు అవినీతిపరులంటూ నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరు ఇబ్బందిపడ్డా.. వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగినా అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచురించిన సీనియర్ జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్ కూడా క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment