రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. దీంతో, జార్ఖండ్‌లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు.
కాగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుత కూటమికి బలపరీక్షను గెలిచే ఛాన్స్ ఉంది.
మరోవైపు.. జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హెమ్‌బ్రోమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్ హెమ్‌బ్రోమ్ అన్నారు. తన సలహాను పట్టించుకోనందుకే మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్‌పుర్ అద్దె చట్టం, సంథాల్ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు.
కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్‌ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే జార్ఖండ్ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక విష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి రాలేదు. ఆయన అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన అసలు ఎవరికీ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. సోమవారం విశ్వాసపరీక్షకు ఆయన గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నాయి. కాగా.. సోమవారం నాటి పరీక్షలో హేమంత్ సోరెన్ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment