ముంబై: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇక అత్యధిక కేసులతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. ఆదివారం ఇక్కడ 10,792 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 15,28,226కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 816 మంది మరణిస్తే.. మహారాష్ట్రలోనే 308 మరణాలు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే.. కాస్త ఊరటగా ఉంది. కేసులు తగ్గుతున్నాయి.. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ అవుతున్నాయి. సంతోషించాల్సిన విషయమే కానీ అజాగ్రత్త తగదు. రానున్నవి పండుగ రోజుల. ఉత్సవాలు, వేడుకలు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. భారీ మూల్యం చేల్లించాల్సి వస్తుంది. మాస్క్, సామాజిక దూరం, శుభ్రత తప్పని సరి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కేసులు పెరుగుతాయి. దాంతో మరోసారి లాక్‌డౌన్ విధించాల్సి వస్తుంది. మాస్క్ ధరిస్తారా.. లేక లాక్‌డౌన్ విధించమంటరా అనేది మీరే నిర్ణయించుకోండి’ అని హెచ్చరించారు ఠాక్రే. (చదవండి: మరణాల్లో ముందున్న మహారాష్ట్ర)
జిమ్‌లు తెరిచేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఠాక్రే. ఇక నవరాత్రి, దీపావళి నేపథ్యంలో నెమ్మదిగా ఆలయాలను తెరుస్తామని తెలిపారు. రైళ్లలో భారీ రద్దీ ఏర్పడుతున్న నేపథ్యంలో ట్రైన్స్ సంఖ్యను పెంచాల్సిందిగా కోరామన్నారు. ముంబైలో ఆదివారం అత్యధికంగా 2,170 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,29,446 కు చేరుకుంది. వాటిలోయాక్టీవ్ కేసులు 25,767 ఉన్నాయి.ముంబైలో ప్రజలు మాస్క్ లేకుండా తిరుగుతున్నట్లు తాను గమనించానని ముఖ్యమంత్రి చెప్పారు. “ముంబైలో, చాలామంది మాస్క్ ధరించడం లేదనే విషయాన్ని నేను గమనించాను. ప్రజలు నియమాలు పాటించకపోతే.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు’’ అన్నారు ఠాక్రే.
Comments
Please login to add a commentAdd a comment