అన్న అంటే నాన్నలో సగం అంటారు. అమ్మా, నాన్నల తర్వాత సోదరికి అంతటి ప్రేమను పంచేది అన్నే. చెల్లెలి ముఖంలో సంతోషం చూసేందుకు అన్న ఎంత కష్టమైన సంతోషంగా చేస్తాడు. సోదరి కష్టాన్ని తన కష్టంగా.. సోదరి సంతోషాన్ని తన సంతోషంగా భావించే అన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే అన్న ఈ కోవలోకి చెందినవాడే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ఓ తండ్రి దురదృష్టవశాత్తు వారికి దూరమయ్యాడు. ఇటీవలే తండ్రి మరణించడంతో అన్న దగ్గరుండి చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించాడు.
అయితే పెళ్లిలో అన్ని ఉన్నా నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో సోదరుడు ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు. చెల్లెలి పెళ్లిలో నాన్న లేని లోటును తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. చనిపోయిన తండ్రి సజీవంగా ఉన్నట్లు మైనంతో ఆయన రూపాన్ని పునఃసృష్టించాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్యర్యం నింపాడు. వీల్‌చైర్‌లో తండ్రి వస్తుండటం చూసి పెళ్లికూతురు కళ్లల్లో కన్నీరు వరదై పారింది. అది మైనపు బొమ్మ అని తెలిసినా.. నాన్నరూపాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
ఒక్కరేంటి బంధువులు, కుటుంబ సభ్యులు, అతిథులు ఇలా అందరి కళ్లలోనూ పట్టలేని దుఖం, ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ కుంటుంబంలో ఆనందపు భాష్పాలు వెల్లువిరిశాయి. అబ్బురపరిచే ఆనందం గుండెలోంచి తన్నుకుంటూ వచ్చింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొడుకు తన తండ్రిపై చాటిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చదవండి: అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు
Comments
Please login to add a commentAdd a comment