ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు? కేసు పూర్వపరాలేమిటి? | V. V. Giri The Only President of India Who Reached The Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన తొలి, చివరి రాష్ట్రపతి ఎవరు?

Published Mon, Sep 11 2023 9:53 AM | Last Updated on Mon, Sep 11 2023 10:32 AM

vv giri the only president who reached the supreme court - Sakshi

ఆ రోజు సుప్రీం కోర్టులో ఆసక్తికర వాతావరణం నెలకొంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరగనున్నదోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు జరిగే ఒక ప్రత్యేక కేసు విచారణలో సాక్ష్యం చెప్పేందుకు ఒక ప్రముఖ వ్యక్తి హాజరుకావాల్సి ఉంది. ఆ ప్రముఖుని కోసం ఒక సోఫాను హాలులో ఏర్పాటు  చేశారు. సాక్షి కోసం సుప్రీంకోర్టు డాక్‌లో సోఫాను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి, చివరిసారి. నిజానికి ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయాలను రద్దు చేసే అధికారం కలిగిన వ్యక్తి స్వయంగా సాక్ష్యం చెప్పేందుకు రాబోతున్నారు. అతనే దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి... ఆరోజు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యునిగా..
సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా దేశాధ్యక్ష్య పదవిలో ఉంటూ, ఆయనే స్వయంగా వాంగ్మూలం ఇవ్వడానికి రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మళ్లీ అలాంటి దృశ్యం కనిపించలేదు. అది 1970వ సంవత్సరం. చట్టపరమైన మినహాయింపు ఉన్నప్పటికీ, అప్పటి రాష్ట్రపతి వివి గిరి కోర్టుకు హాజరై, తన వాంగ్మూలాన్ని వినిపించారు. భారత నాల్గవ రాష్ట్రపతి అయిన వీవీ గిరి 1894 ఆగస్టు 10న ఒరిస్సాలోని బ్రహ్మపూర్‌లో జన్మించారు. అతని తండ్రి వివి జోగయ్య పంతులు న్యాయవాది. భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీల సభ్యుడు. వీవీ గిరి 1913లో న్యాయశాస్త్రం అభ్యసించేందుకు ఐర్లాండ్ వెళ్లారు. తరువాత్‌ భారత్‌ తిరిగివచ్చి బ్రహ్మపూర్ బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు.

తాత్కాలిక రాష్ట్రపతిగా నియామకం
దేశ నాల్గవ రాష్ట్రపతి వివి గిరి కార్మికనేతగానూ పేరుగాంచారు. 1928లో ఆయన నాయకత్వంలో రైల్వే కార్మికుల అహింసాయుత సమ్మె జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం, రైల్వే యాజమాన్యం కార్మికుల డిమాండ్లను అంగీకరించవలసి వచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కార్మిక సంఘాలను భాగస్వాములను చేసిన ఘనత కూడా వివి గిరికి దక్కుతుంది. కాగా దేశ మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1969 మే 13న మరణించారు. అనంతరం వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ సిండికేట్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందిరా గాంధీ వ్యతిరేకతను పట్టించుకోకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
సిండికేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇందిరా గాంధీ.. వివి గిరికి మద్దతు ప్రకటించారు. 1969 ఆగస్టు 16న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో నీలం సంజీవ రెడ్డి, వివి గిరి, ప్రతిపక్ష అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో వివి గిరి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతలో ఆయనకు 48 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆయనకే మెజారిటీ వచ్చింది. అయితే వీవీ గిరి ఎన్నిక చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పుడు పద్ధతులను ఉపయోగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

భారతరత్నతో సత్కారం
ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్రపతి వీవీ గిరి స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరై సాక్షిగా విచారణలో పాల్గొన్నారు. చివరకు సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి, వీవీ గిరి ఎన్నికను సమర్థించింది. వీవీ గిరి 1969 ఆగస్టు 24 నుంచి 1974 ఆగస్టు 24 వరకూ రాష్ట్రపతి పదవిని చేపట్టారు ఆయన తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి అయ్యారు. 1975లో వీవీగిరి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. వీవీ గిరి తన 85 సంవత్సరాల వయస్సులో 1980 జూన్‌ 24న మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) మరణించారు.
ఇది కూడా చదవండి: ఆ ఒక్క జవాను.. పాక్‌ ఆశలను పటాపంచలు చేశాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement