తిరువొత్తియూరు: తెన్‌కాశి సమీపంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న దంపతులు రాత్రి సమయంలో ఇంటికి బైక్‌లో వస్తుండగా కారులో వచ్చిన ఓ ముఠా అడ్డుకుంది. తర్వాత భర్తను హత్య చేసి, భార్య మెడలో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లింది. అయితే పోలీసుల విచారణలో అదంతా హైడ్రామా అని తేలింది. భార్యే ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించినట్లు తెలిసింది.
వివరాల ప్రకారం.. తెన్‌కాశి జిల్లా, సెందామరం సమీపంలోని వెండ్రిలింగాపురానికి చెందిన వైరస్వామి (31). ఇతనికి వీర శిఖామణికి చెందిన ముత్తుమారి (25)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ వెండ్రిలింగాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. వీర శిఖామణిలో ఉన్న ఓ హోల్‌సేల్ ఫర్నీచర్ దుకాణంలో దంపతులిద్దరూ పని చేస్తున్నారు. రోజూ ఉదయం ద్విచక్ర వాహనంలో వెళ్లి రాత్రి ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి వైరస్వామి, అతని భార్య ముత్తుమారి వీరశిఖామణి నుంచి బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో వీర శిఖామణికి, నడుంకురిచ్చికి మధ్య వస్తుండగా వారిని వెంబడిస్తూ వచ్చిన నలుగురు సభ్యుల ముఠా బైక్‌ను అడ్డుకుంది.
ఆ తర్వాత ముత్తుమారి మెడలో ఉన్న మూడున్నర సవర్ల నగను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీన్ని వైరస్వాసామి అడ్డుకోవడంతో అతన్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి దాడిచేసి, పారిపోయారు. అడవి ప్రాంతంలో దిక్కుతోచక నిలబడిన ముత్తుమారి భర్తను లాక్కొచ్చిన ప్రాంతంలోకి వెళ్లి చూడగా అక్కడ వైరస్వామి తీవ్ర గాయంతో మృతదేహంగా కనిపించాడు. దీంతో ముత్తుమారి ఏడుపు విన్న వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైరస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శంకరన్ కోయిల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పొంతన లేని సమాధానాలు చెప్పడంతో..
కేసు నమోదు చేసి ముత్తుమారిని ప్రశ్నించారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమెపై పోలీసులకు సందేహం కలిగింది. ఖాకీ స్టైల్‌లో దర్యాప్తు చేయడంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించినట్లు తేలింది. వివాహానికి ముందే ముత్తుమారికి మరో యువకుడితో సంబంధం ఉందని ఈ సంగతి వైరస్వామికి తెలియడంతో భార్యను తీవ్రంగా మందలించాడు.
దీంతో, భర్తను హత్య చేయడానికి పథకం వేసిన ముత్తుమారి రాత్రి సమయంలో బైక్‌లో వస్తున్న సమయంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నాటకమాడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు హంతకుల కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణరాజు, పులికుడి డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్, క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన యువతి.. మాటలు కలిపి..
Comments
Please login to add a commentAdd a comment