సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల నివాసాల్లో, వారి మనసుల్లో స్థానం సంపాదించుకుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన కేసులపై వాదనలను వరసగా ఎనిమిదో రోజు ఆలకించిన సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘కోర్టు ప్రత్యక్ష ప్రసారాలపై జనంలో చర్చ నడుస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ అనేది సరైన దిశలో ముందడుగు. అయితే ఇంగ్లిష్‌లో సాగే వాదనలను గ్రామాల్లోని చాలా మంది జనం అర్థంచేసుకోలేకపోతున్నారు’ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టులో వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ ‘ నిజమే. లైవ్ స్ట్రీమింగ్‌తో సుప్రీంకోర్టు సాధారణ ప్రజల ఇళ్లలోకి, మనసుల్లోకి చేరింది. ఇదొక నిరంతర ప్రక్రియ. జనం మాట్లాడే భాషల్లో వాదనలు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వాడేందుకు మావైపు నుంచీ ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.
2018లో కోర్టు కార్యకలాపాల ప్రత్యక్షప్రసారానికి సూత్రప్రాయంగా అనుమతించిన సుప్రీంకోర్టు.. 2022 నుంచి ప్రసారం మొదలుపెట్టింది. 2023 ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష ప్రసారాలకు కృత్రిమ మేధ సాయంతో ఇతర భాషల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ (రాసిన లేదా ముద్రించిన కాపీలు) అయ్యేలా చూస్తోంది.
చదవండి: బొగ్గుపై సుంకం స్కామ్‌లో ఈడీ దూకుడు
Comments
Please login to add a commentAdd a comment