
మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎన్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.
హత్రాస్ తొక్కిసలాట
2024, జులై 2న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.
ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్‌పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.
ఝాన్సీ అగ్ని ప్రమాదం
2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్‌ఐసీయూ వార్డులో 54 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం