నిర్మల్: జిల్లాలో ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్‌లో పరిస్థితి రోజురోజుకూ భిన్నంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌లో సొంతనేతలే వేరుకుంపట్లు పెట్టారు. ఈసారి సిట్టింగ్‌ను మార్చడం ఖాయమని, ఇక తామే బరిలో ఉంటామంటూ జాన్సన్‌నాయక్, పూర్ణచందర్‌నాయక్, జనార్దన్‌నాయక్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. వీటిని మొదట్లో ఖండించిన స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ ఇటీవల స్పందించడం లేదు.
తాజాగా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌నూ కలిసివచ్చారు. ఈ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీలోనూ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీపడుతున్న నేతల జాబితా పెద్దగా ఉండడం, ఎవరికివారు పోటాపోటీగా ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి.
ఒకే పార్టీలో ఉన్నవాళ్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారుతున్నారు. మరో పార్టీలో ఉన్న ప్రత్యర్థులను దగ్గర తీసే ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్‌లో సొంతపార్టీ నాయకులు వేరు కుంపటి పెడుతున్నారు. ముధోల్, ఖానాపూర్‌లో కీలక నేతలు భిన్నస్వరం వినిపిస్తున్నారు. ఏకంగా సిట్టింగ్‌లనే మార్చమంటున్నారు. నిర్మల్‌లో కీలక నాయకులే పార్టీ మారారు. మూడు నియోజకవర్గాల్లో పార్టీతో పాటు పలువురు నేతల మాటలూ మారుస్తున్నారు.
భిన్నస్వరం..
స్తబ్దుగా ఉండే ముధోల్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడిప్పుడే భిన్నస్వరం వినిపిస్తోంది. స్వపక్షంలోనే విపక్షంలా అధికార బీఆర్‌ఎస్‌లో కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ను మార్చాలంటూ పార్టీ సీనియర్లను కలుస్తున్నారు. మరోవైపు ఒకరిద్దరు మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే పార్టీని వదిలి కాంగ్రెస్ దిశగా వెళ్తున్నారు.
ఖానాపూర్ నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే స్వరం వినిపిస్తోంది. ఇక్కడా అధికార బీఆర్‌ఎస్‌లోనే లొల్లి నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కాకుండా తాము పేర్కొన్న నేతకు టికెట్ ఇవ్వాలంటున్నారు ఇక్కడి నేతలు. కానీ.. ఇక్కడ జాన్సన్‌నాయక్, పూర్ణచందర్‌నాయక్, జనార్దన్‌రాథోడ్, శర్మన్‌చౌహాన్ ఇలా వర్గాలుగా వీడి పార్టీపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఎవరి దారి వారిదే..
ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంత అసమ్మతి రాగం వినిపించినా లాభం ఉండదనుకునే నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు. ముధోల్, నిర్మల్‌లో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, కీలక నేతలు పార్టీలు మారడం మొదలు పెట్టారు.
నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై వ్యతిరేకతతో సీనియర్ నేత, ఉద్యమకారుడు శ్రీహరిరావు, సారంగపూర్ జె డ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రితోపాటు గు లాబీ పార్టీపై ఆరోపణలు చేస్తూ.. మరింతమందిని తీసుకెళ్లే ప్రయత్నాలూ చేస్తున్నారు. మరోవైపు తమ పార్టీకి తగ్గిన బలాన్ని పెంచుకునేందుకు అన్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తిని ఇటీవలే మంత్రి కారెక్కించుకున్నారు.
తాజాగా ముధోల్‌లో రాజీనామాలు, చేరికల పర్వం మొదలైంది. ముధోల్ మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్ దంపతులు, మాజీ ఎంపీపీ సాయిబాబా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న ట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరుతామని వీరు ప్రకటించకున్నా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిరావడంతో కాంగ్రెస్‌లో చేరవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment