ఎన్నికల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

Published Thu, Jun 15 2023 7:14 AM | Last Updated on Thu, Jun 15 2023 10:38 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీ కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు తొలగించారని అర్హులైన ఏ ఒక్క ఓటరు నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని, జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలించాలన్నారు. కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు.

ఎన్నికల ఏడాది కావడంతో ఓటరు జాబితా పునఃపరిశీలించుకుని లోటుపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని తెలిపారు. 2018, 2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే, ఓటర్ల సంఖ్య తగ్గినట్లయితే అందుకు గల కారణాలు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్ల మార్పులు–చేర్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈనెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి పోస్టల్‌ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియ కొనసాగించాలన్నారు.

ఇప్పటికే ఈవీఎంల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ ఆయా జిల్లాల్లో ప్రారంభమైందని గుర్తుచేశారు. జూలై 01 నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. పోలింగ్‌ స్టేషన్లు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయించాలన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ పోలింగ్‌ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలని, భద్రతాపరమైన ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించాలని డీజీపీ అంజనీకుమార్‌ యాదవ్‌ పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఇన్‌చార్జి సీపీ ప్రవీణ్‌ కుమార్‌, ట్రెయినీ అడిషనల్‌ కలెక్టర్‌ కిరణ్మయి, నియోజకవర్గాల ఎన్నికల అధికారులు డీఆర్‌డీవో చందర్‌, జెడ్పీ సీఈవో గోవింద్‌, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement