
నిజామాబాద్: మండలంలోని భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మామిడి హరిబాబు (27) బుధవారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లాడు.
అక్కడి నుంచి తన చిన్నాన్న కుమారుడైన దుర్గ శైలంనకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పంపాడు. అందులో తన ఆత్మహత్యకు గ్రామానికి చెందిన మంద నవీన్, తన అత్త మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన పిట్ల లక్ష్మి, తన భార్య నవనీత కారణమని వీడియోలో పేర్కొన్నాడు.
వీడియో చూసిన శైలం విషయాన్ని హరిబాబు కుటుంబీకులకు చెప్పాడు. వారు పొలం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
కడుపు నొప్పి భరించలేక వృద్ధుడు..
కాగా, ఇదే గ్రామమైనటువంటి భాగిర్తిపల్లిలో కడుపునొప్పి భరించలేక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన గొండ్రు చిన్న నారాయణ (65) రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు.
ఆస్పత్రుల్లో చూపెట్టుకున్నా నయం కాలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మైసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
గ్రామంలో విషాదఛాయలు
భాగిర్తిపల్లిలో ఒకే రోజు ఇద్దరి అంత్యక్రియలు జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన హరిబాబు, నారాయణ అంత్యక్రియలు గురువారం సాయంత్రం గ్రామంలో నిర్వహించారు.