చంద్రబాబు కీలక అనుచరుడు కేసీ చేకూరి
డల్లాస్ : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతులు దొర్లాయి. ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున హాజరయిన ఈ వేడుకల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. డల్లాస్‌లో జరిగిన మ్యూజికల్ నైట్ లో అర్థరాత్రి దాటాక మద్యం మత్తులో జై బాలయ్య అంటూ పవన్ అభిమానుల మీదకు టీడీపీ ఎన్‌ఆర్‌ఐ ముఖ్యుడు కేసీ చేకూరి దూసుకెళ్లినట్టు అక్కడి వారు తెలిపారు. వివాదం శృతి మించడంతో అమెరికా పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్ చేసి కరోల్‌టన్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కేసీ చేకూరికి సంబంధించిన రికార్డులను పరిశీలించగా.. డల్లాస్‌లో నమోదయిన మరో కేసులోనూ ప్రమేయం ఉన్నట్టు తేలడంతో డల్లాస్ జైలుకు తరలించారు.
అసలేం జరిగింది?
టెక్సాస్ రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉంటారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డల్లాస్‌లోని తెలుగు ప్రజలు కొందరు "తగ్గేదేలే" పేరుతో ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని కరోల్‌టన్‌లోని డల్లాస్ పామ్స్‌లో నిర్వహించారు. దీనికి చాలా మంది తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఓ టాలీవుడ్ హీరోయిన్‌ను ముఖ్య అతిథిగా పిలిచిన ఈ వేడుకల్లో మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సర వేడుకలు జరుగుతుండగా.. ఈవెంట్‌కు వచ్చిన వారిలో టిడిపి, జనసేన అభిమానులు .. తమకు నచ్చిన పాటలు కావాలంటూ పట్టు పట్టారు.
ముందు బాలకృష్ణ పాటలు వేయగా, మరికొందరు చిరంజీవి పాటలు కావాలని డిమాండ్ చేశారు. చిరంజీవి పాటలు వద్దంటూ తమ మాటే వినాలంటూ కేసీ చేకూరి నేతృత్వంలో టిడిపి కార్యకర్తలు గొడవకు దిగారు. ఆ తర్వాత అది శృతి మించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన అభిమానులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. రెండు వర్గాలు కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత స్థానిక సెక్యూరిటీ బయటకు పంపించేశారు.
అంతలోనే మళ్లీ లోనికి వచ్చిన కేసీ చేకూరి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోస్టర్లను తగులబెట్టారు. సర్ది చెప్పటానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై చేకూరి పిడిగుద్దులతో విరుచుకుపడ్డట్టు తెలిసింది. ఈ ఈవెంట్‌కు సెక్యూరిటీగా స్థానిక అమెరికన్లు ఉన్నారు. తెలుగుదేశం వర్గాన్ని వారు ఆపేందుకు ప్రయత్నించినప్పుడు కేసీ చేకూరి వారిపైనా దాడి చేసినట్టు తెలిసింది. నియంత్రించలేకపోయే పరిస్థితి ఏర్పడడంతో స్థానిక సెక్యూరిటీ 911కు ఫోన్ చేసి టెక్సాస్ పోలీసుల సాయం అడిగారు.
క్షణాల్లో అక్కడికి చేరుకున్న అమెరికన్ పోలీసులు.. గొడవకు ప్రధాన కారణమైన కేసీ చేకూరిని గుర్తించి అరెస్ట్ చేశారు. అందరి ముందే కేసీ చేకూరి చేతులకు బేడిలు వేసి మరీ తరలించారు పోలీసులు. చంద్రబాబు, లోకేష్‌లకు నమ్మినబంటు, టిడిపి ఎన్నారైలో కీలక నేత అరెస్ట్ కావడంతో టీడీపీ తానా పెద్దలు రంగంలోకి దిగారు. రాజీ ప్రయత్నాలు చేయడంతో పాటు వెంటనే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఎవరీ కేసీ చేకూరి?
కేసీ చేకూరి.. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లిన ప్రవాసాంధ్రుడు. చంద్రబాబుకు దగ్గరి అనుచరుడు. తెలుగుదేశం పార్టీ NRI విభాగంలో కీలక సభ్యుడు. బాబు అమెరికాకు ఎప్పుడొచ్చినా.. వెంటే ఉంటాడు. ఎమినెన్స్ మేనేజింగ్ ఇంటలెక్చువల్ కాపిటల్ పేరుతో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తరపున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో పాటు పార్టీ పోస్టింగ్‌లను విస్తృత ప్రచారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాడు. బాలయ్య అడ్డా.. డాలస్ గడ్డా అంటూ పోస్టులు పెడుతూ తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాడు. గతంలో వరద బాధితుల కోసం చిరంజీవి డల్లాస్ వెళ్లినప్పుడు.. కేసీ చేకూరి నేతృత్వంలోని ఒక వర్గం నల్ల జెండాలు చూపెట్టి ఆయన్ని ఘోరావ్ చేయటానికి ప్రయత్నం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment