సింగపూర్: ప్రకాశం జిల్లా మైనంపాడుకు చెందిన గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి నృత్యాభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఐదేళ్ల ప్రాయం నుంచే నాట్యం అభ్యసించిన సాయి తేజస్వి అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాల్లో అవార్డులను, 2019లో త్యాగయ్య టీవీ కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందారు.
సోదరి ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమంలో సాయి గురువు శ్రీలిజీ శ్రీధరన్ రూపకల్పన చేసిన నృత్యాలతో తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను అలరించారు. శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను అందుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులు పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు శ్రీమతి పద్మజా రెడ్డి సాయితేజస్వి ని ఆశీర్వదించారు. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి శ్రీ వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిధులుగా విదూషి డా.ఎం.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త శ్రీమతి సునీత రెడ్డి హాజరై సాయి తేజస్వికి దీవనెలు, అభినందనలు అందించారు.
ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు. హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం భావితరానికి స్ఫూర్తిదాయకమనీ, భారతీయ కళలకు గర్వకారణమని సభికులు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment