సమన్వయంతో సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సమగ్రాభివృద్ధి

Published Fri, Jan 31 2025 1:59 AM | Last Updated on Fri, Jan 31 2025 1:59 AM

సమన్వ

సమన్వయంతో సమగ్రాభివృద్ధి

చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాలో జిల్లా పరిషత్‌ ద్వారా సమన్వయంతో సమగ్రాభి వృద్ధి సాధించుకుందామని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక చెప్పారు. జెడ్పీ బడ్జెట్‌ సమావేశాన్ని గురువారం కార్యాలయ సమావేశ హాల్లో నిర్వహించారు. తొలుత 2024–25, 2025–26 అంచనాల బడ్జెట్‌ నివేదికను ఆమె చదివి వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి బుధవారం నుంచి అమలులోకి రావడంతో సభ్యులు వారి పరిధిలోని సమస్యలను తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజిబెత్‌ రాణి బడ్జెట్‌ కేటాయింపులపై మాట్లాడుతూ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలని, మహిళా సాధికారతకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. కోడూరు జెడ్పీటీసీ సభ్యుడు వై.సత్యనారాయణ మాట్లాడుతూ అవనిగడ్డ – కోడూరు రహదారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పూర్తి చేయాలని కోరారు. మొవ్వ జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు వి.పరిశుద్ధరాజు ఏడు మండలాలు కలిపే మొవ్వ ప్రధాన రహదారి గోతులమయంగా మారిందని అధికారులకు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ఎ.కొండూరు జెడ్పీటీసీ సభ్యులు భూక్యా గన్యా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా చీమలపాడు గ్రామంలోని పాఠశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణం మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ప్రధానోపాధ్యాయుని ఖాతాలో నిధులు ఉన్నా వాటిని వినియోగించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్‌ మాట్లాడుతూ మండల పరిధిలోని ముక్కొల్లులో సీడబ్ల్యూఎస్‌ స్కీం చెరువు చుట్టూ ఫెన్సింగ్‌కు నిధులు కేటాయించినా ఏర్పాటు చేయకపోవడంతో గేదెలు సంచరిస్తున్నాయని నీరు కలుషితమయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వత్సవాయి జెడ్పీటీసీ సభ్యురాలు వై.దేవమణి ఇటీవల వరదలకు పైప్‌లైన్లు కొట్టుకుపోయాయని వీటిని తిరిగి ఏర్పాటుచేయకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మండవల్లి ఎంపీపీ పి.శ్రీరామదుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ మండల పరిధిలో ‘ఉపాధి’లో కేవలం సీసీ రోడ్లకు ప్రాధాన్యమిస్తున్నారని అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీలు, సచివాలయ భవన నిర్మాణాలకు కూడా వీటిని వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.

ముందుగా లిఖితపూర్వకంగా ఇవ్వండి

అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సభ్యులు ప్రతి సమావేశంలో అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యలను ఆ తర్వాత సమావేశానికి పనులు నిర్వహించేలా చూడాలన్నారు. జెడ్పీ సీఈవో కన్నమనాయుడు మాట్లాడుతూ ఇక నుంచి సర్వసభ్య సమావేశం నిర్వహించేటప్పుడు ముందుగా సభ్యులు సమస్యలను లిఖితపూర్వకంగా అందజేస్తే వాటిని అజెండాలో పెట్టి సంబంధిత అధికారులకు పంపుతామని తెలిపారు. ఆ సమావేశంలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధికి కాక సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాట్లాడటంతో.. కృత్తివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయకూడదని వారించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తొలుత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

2024–25లో జెడ్పీ నిల్వ అంచనా రూ. 172.02 కోట్లు 2025–26 నిల్వ అంచనా రూ. 182.31 కోట్లు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

2024–25 ముగింపు నిల్వ అంచనా రూ. 172.02 కోట్లు

జెడ్పీ బడ్జెట్‌ సమావేశాల్లో చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ 2024–25, 2025–26 కు సంబంధించిన బడ్జెట్‌ వివరాలను వెల్లడించారు. 2024–25 బడ్జెట్‌ ప్రకారం ప్రారంభ నిల్వ 188.86 కోట్లు కాగా, ఆదాయం అంచనా రూ. 778.01 కోట్లు, ఖర్చు అంచనా రూ. 794.85 కోట్లుగా తెలిపారు. ఈ ఏడాది ముగింపు నిల్వగా రూ. 172.02 కోట్లుగా చూపారు. 2025–26 బడ్జెట్‌ అంచనా ప్రారంభ నిల్వ రూ. 172.02 కోట్లు, ఆదాయం అంచనా రూ. 1310.54 కోట్లు కాగా, ఖర్చు అంచనా రూ. 1300.25 కోట్లు, ముగింపు నిల్వ అంచనా రూ. 182.32 కోట్లు గా వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సమన్వయంతో సమగ్రాభివృద్ధి 1
1/1

సమన్వయంతో సమగ్రాభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement