
చంటిబిడ్డలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రాంతాల నుంచి నెలలు నిండని పసికందులను తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంతానం లేని దంపతులకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న ఐదుగురు మహిళలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్టు చేసింది. నిందితుల నుంచి ముగ్గురు పసికందులను, ఓ బాబును విక్రయించగా వచ్చిన రూ.4 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు శనివారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు... పసిబిడ్డల విక్రయాలపై అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏసీపీ కె.లతాకుమారి, నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, నున్న పోలీస్ సిబ్బంది నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్‌నగర్‌లో సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని చంటి పాపలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులైన విజయవాడ సితార సెంటర్‌కు చెందిన బలగం సరోజిని, అజిత్ సింగ్‌నగర్‌కు చెందిన షేక్ ఫరీనా, షేక్ సైదాబీ, ప్రకాష్‌నగర్‌కు చెందిన కొవ్వరపు కరుణశ్రీ, ప్రకాష్‌నగర్‌కు చెందిన పెదాల శిరీషను అదుపులోకి తీసుకున్నారు. వారిలో బలగం సరోజినికి కొన్నేళ్ల క్రితం నగరంలోని ఓ హాస్పిటల్ సమీపంలో విజయలక్ష్మితో పరిచయమైంది. ఆమె సూచన మేరకు సరోజిని పిల్లలు లేని, సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఎగ్స్ డొనేట్ చేసి తద్వారా వచ్చిన డబ్బులను తీసుకుంది. సులభంగా డబ్బులు వస్తున్న నేపథ్యంలో మరికొంతమంది మహిళలతో ఎగ్స్ డొనేట్ చేయించి కమీషన్ తీసుకునేది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ సూచన మేరకు పిల్లలను విక్రయించి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు సరోజిని సిద్ధపడింది. ఢిల్లీకి చెందిన యువతి ప్రీతికిరణ్, అహ్మదాబాద్‌కు చెందిన యువకుడు అనిల్‌ను పరిచయం చేసుకుంది. ప్రీతికిరణ్, అనిల్ ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి విజయవాడకు తీసుకొచ్చిన చంటి బిడ్డలను సరోజిని రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు కొనుగోలు చేసేది. ఈ పిల్లలను ప్రకాష్ నగర్‌లోని కరుణశ్రీ , పెదాల శిరీష ఇళ్లలో ఉంచేది. అనంతరం సరోజిని పలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సంతానం కోసం ఇబ్బందులు పడే దంపతులను గుర్తించేది. వారితో ఆమె వద్ద ఉన్న బిడ్డలను విక్రయించేందుకు బేరం కుదుర్చుకునేది. ఆడ బిడ్డను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు, మగ బిడ్డను రూ 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించేది. బేరం పూర్తయిన తర్వాత కరుణశ్రీ , శిరీష ఇళ్లలో ఉన్న చంటి బిడ్డలను షేక్ ఫరీనా, సైదాబీలు డబ్బులు చెల్లించిన దంపతులకు చేరవేసేవారు. చట్టబద్ధత ప్రకారం పిల్లలను దత్తత తీసుకునేందుకు విముఖత చూపించే దంపతులను సరోజిని టార్గెట్ చేసేది. సరోజిని గతంలో మేడ్‌పల్లి, ముంబయిలలో పిల్లలను అక్రమంగా విక్రయించిన కేసుల్లో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. గత ఏడాది ఆగస్ట్ నెలలో జైలు నుంచి విడుదలైంది. జైలు జీవితం అనుభవించిన తర్వాత సైతం ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. గడిచిన ఆరు నెలల్లో ఏడుగురు పిల్లలను ఢిల్లీ, అహ్మదాబాద్ చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది. ఏలూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన దంపతులకు నలుగురు పిల్లలను అమ్మింది. మరో ముగ్గురు చంటి బిడ్డలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు. నిందితులపై బీఎన్‌ఎస్ 143, 81, 87 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. సమావేశంలో డీసీపీలు గౌతమి సాలి, కె.జి.వి.సరిత, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, ఏసీపీలు కె.లతాకుమారి, స్రవంతిరాయ్ పాల్గొన్నారు.
ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి పిల్లలను తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్న వైనం ఐదుగురు మహిళలు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment