
ఆరు ప్రాథమిక స్కూళ్లకు మంగళం?
పెనమలూరు: ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలంలో ఆరు ప్రాథమిక పాఠశాలలకు మంగళం పలకనున్నారు. ఈ మేరకు తీర్మానం చేయవలసిందిగా ప్రభుత్వం ఆయా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలపై ఎస్‌ఎంసీలు, తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలో ప్రాఽథమిక, యూపీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మొత్తం 36 ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలలను గ్రేడ్‌లుగా విభజించటానికి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులు తక్కువగా ఉన్న ఆరు ప్రాథమిక పాఠశాలలపై అఽధికారులు కన్నేశారు. పాఠశాలలను 1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్స్, 60 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్(ఎంపీఎస్), 60 మందికి లోపు విద్యార్థులు ఉంటే బేసిక్ స్కూల్(బీపీఎస్)గా విభజిస్తున్నారు. ఇందులో భాగంగా గోసాల, పోరంకి బీజేఆర్ నగర్, యనమలకుదురు మండపం స్కూల్, పెదపులిపాక దళితవాడ స్కూల్, యనమలకుదురు ఇందిరానగర్ స్కూళ్లలో ఉన్న 3,4,5 తరగతులను ఎత్తివేసి వాటిని ఎంపీఎస్, బీపీఎస్‌లో కలుపుతారు. మండలంలో ఎంపీఎస్ స్కూల్స్ 18, బీపీఎస్ స్కూల్స్ 5గా నిర్ణయించారు.
‘ప్రాథమిక’ విద్యార్థులకు కష్టాలే...
విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో ఆరు ప్రాథమిక పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. ఈ కారణంగా గోసాల తెలుగు, పెదపులిపాక దళితవాడ, చోడవరం దళితవాడ, యనమలకుదురు మండపం పాఠశాల, పోరంకి బీజేఆర్‌నగర్‌లోని పాఠశాలలో 3,4,5 తరగతులు చదివే విద్యార్థులు చాలా దూర ప్రాంతాల్లో ఉండే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుంది. చాలా సంవత్సరాలుగా పేదలు నివసించే ప్రాంతాల్లో ఉన్న ఈ పాఠశాలల్లో 3,4,5 తరగతులు తొలగించటం తగదని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఎంసీ తీర్మానం కోరిన ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో... అభ్యంతరం తెలుపుతున్న తల్లిదండ్రులు
చోడవరానికి జిల్లా పరిషత్ పాఠశాల
చోడవరం గ్రామంలో నూతనంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మండలంలో ఇప్పటికే కానూరు, పోరంకి, యనమలకుదురు, వణుకూరు, తాడిగడప, పెనమలూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా చోడవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వస్తే మండలంలో మొత్తం ఏడు స్కూళ్లు అవుతాయి.
చోడవరం పాఠశాల
Comments
Please login to add a commentAdd a comment