
హత్య కేసులో నిందితుల అరెస్టు చెరువుబజార్‌లో జరిగిన ఘటనల
జగ్గయ్యపేట అర్బన్: చెరువు బజార్‌లో గత నెల 27న జరిగిన హత్య కేసులో నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రూరల్ డీసీపీ మహేశ్వరరాజు పర్యవేక్షణలో, నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు. అక్కడ సేకరించిన సాంకేతిక ఆధారాలతో దర్యాప్తులో వేగం పెంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం పద్మావతినగర్ చెక్‌పోస్ట్ వద్ద ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరొక జువైనెల్‌ను అదుపులోకి తీసుకున్నామని, జువైనెల్ హోంకు తరలిస్తామని తెలిపారు. చెరువుబజారుకు చెందిన బత్తుల కిషోర్‌బాబు, బత్తుల వెంకట శివకుమార్, బండి సాయి, బండి రవికుమార్, వేముల జ్వాలా నరసింహరావు, రూపన వినయ్, ఒక జువైనెల్(మైనర్ వ్యక్తి) ఉన్నారు. నిందితులంతా చెరువుబజారుకు చెందిన వారేనని, చెడు వ్యసనాలకు బానిసలయ్యారని తెలిపారు. స్థానికుడు బత్తుల శ్రీను అనే పూజారి వీరి ఆగడాలను అడ్డుకునేవాడని తెలిపారు. దీంతో వారు అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారని, ఊరేగింపు సమయంలో ఉద్దేశపూర్వకంగా బత్తుల శ్రీను మేనల్లుడు ఓర్సు నాగబాబుతో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. బత్తుల శ్రీను అడ్డురాగా, అందరూ కలిసి వారిని కొట్టి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జేబులో ఉన్న కోడికత్తిని తీసి శ్రీను మెడపై, వెనుక పొడిచారని పేర్కొన్నారు. తర్వాత శ్రీను అన్న బత్తుల వెంకటేశ్వర్లును భుజం మీద పొడిచి అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. సమావేశంలో పేట ఎస్‌ఐ జి.రాజు, చిల్లకల్లు ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం ఆరుగొలనులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరు జిల్లా గుండుగొలనుకు చెందిన చిగురుపాటి నాగరాజు తన భార్య ఇందు, కుమారులు ఏలియాజర్ (12), నోహాల్ పాల్ (7)తో కలిసి బైక్‌పై గుడివాడలోని ఓ చర్చికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో ఆరుగొలను వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని తప్పించబోతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అదుపు తప్పి ఢీకొట్టారు. బైక్‌పై ముందు కూర్చున్న చిన్న కుమారుడు చిగురుపాటి నోహల్ పాల్(7) తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఇది చూపరులను కలిచి వేసింది. కళ్ల ఎదుటే కన్నకొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి నోహల్‌పాల్ మృతదేహానికి గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. హనుమాన్‌జంక్షన్–2 ఎస్‌ఐ నరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్ వి.నిర్మలకుమారి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని ఎన్జీఓ హోమ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆటల పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మలకుమారి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగే పోటీలను క్రీడాశాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 4,5, 6 తేదీల్లో పలు విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 8వ తేదీ ఎన్జీఓ హోంలో మహిళా దినోత్సవ మహాసభ జరుగుతుందని వివరించారు. సమావేశంలో మహిళా కమిటీ కన్వీనర్ ఎం.రాజలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి.జానకి, రాష్ట్ర కార్యదర్శి బి.తులసి రత్నం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment