
నిజాయతీతో సేవలందించాలి
ఏలూరు టౌన్: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, నిజాయతీతో సేవలందించాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తిచేసుకున్న ప్రొబేషనరీ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఆదివారం ఏలూరు రేంజ్ కార్యాలయంలో ఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొబేషనరీ ఎస్సైలకు ఆయన నియామక ఉత్తర్వులు అందజేశారు. రేంజ్ పరిధిలో 100 మంది (68 మంది పురుషులు, 32 మంది మహిళలు) ఎస్సై శిక్షణ పూర్తిచేసుకోగా జిల్లాల వారీగా ఏలూరు 1, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ జిల్లా 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 1, తూర్పుగోదావరి జిల్లా 15, పశ్చిమగోదావరి జిల్లా 1, కృష్ణా జిల్లా 20, ఎన్‌టీఆర్ జిల్లా 56 మంది ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో పనిచేయటం అదృష్టంగా భావిస్తూ చట్టాలకు లోబడి సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని ఐజీ పిలుపునిచ్చారు.
ముగిసిన జిల్లా స్థాయి
క్రీడా పోటీలు
గన్నవరం: కేసరపల్లిలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో ఆదివారం హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఏడో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎంవీ సుబ్బారావు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ దేశంలో స్పోర్ట్స్ ఫర్ చేంజ్ ప్రోగ్రాంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక సామర్థ్యాలను పెంపొందించడం, చురుకైన వ్యాయామంలో భాగస్వామ్యం చేయడం లక్ష్యమన్నారు. అనంతరం అథ్లెటిక్స్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, జావలిన్ త్రో, షాట్‌పుట్, హ్యాండ్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, వాలీబాల్, రగ్బీ, ఫుట్‌బాల్ క్రీడల్లో పోటీల్లో నిర్వహించారు. బాలుర విభాగంలో తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ పాఠశాల, బాలికల విభాగంలో గొడవర్రు జెడ్పీ హైస్కూల్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించాయి. పలువురు హెచ్‌సీఎల్ ప్రతినిధులు, టెక్నికల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నారాయణ టాలెంట్ టెస్టు అడ్డుకున్న ఎంఈవో
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని నారాయణ టెక్నో స్కూల్లో ఆదివారం నిర్వహిస్తున్న టాలెంట్ టెస్టును ఎంఈఓ శ్యాంసుందర్ అడ్డుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్ కోసం టెస్టు నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈఓ తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థుల నుంచి ప్రశ్నపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు బయటకు పంపారు.
నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్
మైలవరం: మైలవరం నారాయణ హైస్కూల్లో ఆదివారం విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టాలెంట్ టెస్టులను నిర్వహించడంపై నిషేధం ఉంది. ఆ నిబంధనను బేఖాతర్ చేస్తూ స్థానిక నారాయణ స్కూల్ యాజమాన్యం టాలెంట్ నిర్వహించారు. దీనిపై ఎంఈఓ ఎల్.బాలును వివరణ కోరగా తమకు సమాచారం అందిన వెంటనే స్పందించి పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఇళ్లకు పంపించామన్నారు. పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించామని పేర్కొన్నారు.

నిజాయతీతో సేవలందించాలి
Comments
Please login to add a commentAdd a comment