ప్రైవేటుతో మిలాఖత్!
● నిబంధనలకు తిలోదకాలిస్తూ నియామకాలు ● చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులుగా ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల నియామకం ● ఆయా కళాశాలలు సెంటర్లుగా ఉన్నచోటే వారికి విధులు ● ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఇంటర్మీడియెట్ అధికారులు
మళ్లీ పరిశీలిస్తాం..
ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించాం. నియమితులైన వారంతా ఎయిడెడ్ కళాశాలలకు చెందిన వారని అనుకుంటున్నా. అయినా ఒకసారి పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం. అవసరమయితే వారిని తొలగించి వేరే వారిని నియమిస్తాం. ప్రస్తుతం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టాం.
– వీవీ సుబ్బారావు,
కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్, ఇంటర్మీడియెట్
పెడన: గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియెట్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు కళాశాలలకు మేలు చేసే విధంగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్ష ఎటువంటి సామగ్రి.. పరికరాలు లేని చోట నిర్వహించి ముక్కున వేలేసుకునేలా చేశారు. ఇప్పుడు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన నియామకాల్లోనూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటు అధికారులను నియమించే విషయంలో ప్రైవేటు కళాశాలలకు దాసోహమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రైవేటు కళాశాలలో(అన్ ఎయిడెడ్) పనిచేసే అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులుగా నియమించడమే కాకుండా.. వీరిని పరీక్ష కేంద్రాలుగా ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో విధులకు కేటాయించడం వివాదాస్పదమవుతోంది.
నిబంధనలు ఇవి..
ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించాలంటే కొన్ని నియమ నిబంధనలను ఇంటర్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. ఎగ్జామ్స్ హ్యాండ్ బుక్ కూడా ప్రింట్ చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. అందులోని పొందుపరిచిన వివరాల మేరకు..
● ప్రభుత్వ కళాశాల జూనియర్ లెక్చరర్ సీనియార్టీ ఉన్న వారిని నియమించాలి.
● వీరు లేకపోతే ఎయిడెడ్ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్ లేదా రెగ్యులర్ లెక్చరర్‌కు విధులు కేటాయించాలి. ఏపీఆర్‌జేసీ, ఏపీటీడబ్ల్యూర్‌జేసీ కంపోజిట్ కళాశాలల వారిని నియమించాలి.
● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో రెగ్యులర్ ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లకు విధులు కేటాయించాలి.
● వీరు కూడా లేకపోతే ప్రభుత్వ కళాశాలలో మినిమమ్ టైమ్ స్కేల్‌పై పనిచేసే వారిని నియమించాలి.
● వీరు కూడా లేకపోతే మూడేళ్లు సీనియర్టీ ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలి.
● వీరంతా లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించే స్కూలు అసిస్టెంట్ కేడర్‌వారిని చీఫ్ సూపరింటెండెంట్లుగా, డిపార్ట్‌మెంటు అధికారులుగా నియమించాలి.
● కానీ అందుకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలకు చెందిన వారిని నియమించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అడిగిన చోట విధులు..
అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, చల్లపల్లి కళాశాలలో విధులు నిర్వహించేవారు మచిలీపట్నం నుంచే నిత్యం రాకపోకలు చేస్తుంటారు. వీరందరికీ మచిలీపట్నంలోనే పరీక్షల విధులు కేటాయించడం గమనార్హం. ఎవరు, ఎక్కడికి వెళతారంటూ చీఫ్ సూపరిండెంట్లకు, డిపార్ట్‌మెంటు అధికారులకు అవకాశం కల్పించడమే కాకుండా చివరకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారు కోరుకున్న చోటకు సదరు అధికారులను ప్రసన్నం చేయించుకోవడం ద్వారా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment