కిక్కిరిసిన దుర్గమ్మ సన్నిధి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు, యాత్రికులతో పాటు విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున దుర్గమ్మకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం రద్దీ సాధారణంగా ఉన్నా.. 10 గంటల తర్వాత క్రమంగా పెరిగింది. దీంతో సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ.100, రూ. 300, రూ. 500 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయగా, రద్దీ మరింత పెరిగింది. మహా నివేదన అనంతరం 12.20 గంటలకు దర్శనం తిరిగి ప్రారంభం కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగింది. రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా, త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ ఏఈవోలు, సూపరింటెండెంట్లు క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.
అద్దాల మండపంలో పవళింపు సేవ..
మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం పవళింపు సేవ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ జరిపించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు సేవలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment