కారు ఢీకొని వ్యక్తి మృతి
కంకిపాడు: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ప్రొద్దుటూరు పరిధిలోని శరత్ చంద్ర అకాడమీ ఎదురుగా జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తి (40)ని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు తాడిగడప వాసిగా సమాచారం. మృతుడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని ఎస్‌ఐ డి.సందీప్ తెలిపారు.
మార్కులు సరిగా రాలేదని విద్యార్థ్ధిని ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పరీక్షలలో మార్కులు సరిగా రాలేదని మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వించిపేట గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన శాన్నం నాగమణి, చలపతిబాబు దంపతులకు ఇద్దరు సంతానం. చలపతిబాబు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. కుమార్తె డీనా వైష్ణవి(20) పీబీ సిద్ధార్థ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. మూడో సెమిస్టర్ ఫలితాలు శనివారం వచ్చాయి. ఆ ఫలితాలలో మార్కులు తక్కువ రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వైష్ణవి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లి వచ్చిన తల్లి ఇంట్లో తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూసేసరికి లోపల వైష్ణవి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపిన తండ్రి చలపతిబాబు తన ఆటోలోనే కుమార్తెను ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment