భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యాన విజయవాడ భవానీపురంలో నిర్వహిస్తున్న ఏపీఆర్‌ఎస్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్. శివకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 40 సీట్లు, 6, 7, 8 తరగతుల్లో (బ్యాక్ లాగ్) మిగిలి ఉన్న సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముస్లిం (బీసీ–ఇ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టెడ్ క్రిస్టియన్) విద్యార్థినులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా తరగతుల్లో ప్రవేశానికి శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో htt pr://aprrapcfrr.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
మృతుడు తాడిగడప వాసిగా గుర్తింపు
కంకిపాడు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప వాసిగా పోలీసులు తేల్చారు. ఎస్‌ఐ సందీప్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈనెల 3న కంకిపాడు బైపాస్ సమీపంలో ప్రొద్దుటూరు పరిఽధిలోని శరత్‌చంద్ర అకాడమి దగ్గర విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి దాటుతున్న వ్యక్తిని ఉయ్యూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో మృతి చెందిన వ్యక్తి పెనమలూరు మండలం తాడిగడప శ్రీనగర్‌కు చెందిన సింగంపల్లి సాయి (40)గా నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు ఉయ్యూరులోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌దిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ప్రిన్సిపాల్ స్వయంగా కారు నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
వృద్ధురాలి హత్య కేసులో జీవిత ఖైదు
విజయవాడలీగల్: నగలు కోసం వృద్ధురాలిని హత్యచేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎస్.నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే నవంబరు, 2014లో విజయవాడ గుణదల ప్రాంతంలో మాధురి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. తోట్లవల్లూరు గ్రామానికి చెందిన కార్పెంటర్ అబ్దుల్ అజీజ్ అనే బుజ్జి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె చేతికి ఉన్న బంగారుగాజులు దొంగి లించి, ఆమెను హత్యచేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఐపీసీ 302, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు దర్యాప్తు చేసి, బుజ్జిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.జేమ్స్, సీఎంఎస్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, మాచవరం ఇన్‌స్పెక్టర్ ప్రకాష్‌రావు పర్యవేక్షణలో 18మంది సాక్షులను విచారణ చేశారు. బుజ్జిపై నేరం రుజువు కావడంతో నగలు దోపిడీ చేసి, హత్యచేసినందుకు నిందితుడికి జీవితఖైదు, రూ. 3 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment